వరంగల్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తమ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ‘తెలిసి మోసం చేసి.. తెలియదని నాటకం’ ఆడుతున్నదని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బుకాయించి.. ఆరునూరైనా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినదంతా డొల్లేనని బీసీలు మండిపడుతున్నారు. బీసీల అనుమానం నిజమైంది.
బీసీ మేధావులు, బుద్ధిజీవులు న్యాయస్థానంలో నిలిచేలా రిజర్వేషన్ల పెంపును చేయాలని వాదించినా.. రాజ్యాంగ సవరణకు కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకొస్తే తప్ప రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని బీఆర్ఎస్ మొదటి నుంచీ చెబుతున్నా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నవారికి ఈ పరిణామాలన్నీ తెలియక చేశారా? అంటే అక్షరాలా అన్నీ తెలిసే కాంగ్రెస్ బీసీలను వంచించిందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక చేత్తో రిజర్వేషన్ల పెంపు.. మరో చేత్తో న్యాయస్థానంలో కేసులు వేయించడం.. ఈ రెండూ కాంగ్రెస్ పార్టీకి వెన్నతోపెట్టిన విద్య అని మరోసారి తేలిపోయిందని బీసీ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యాయస్థానం అడ్డుపడినందువల్లే తాము రిజర్వేషన్లను అమలు చేయలేకపోతున్నామని నమ్మించడంలో భాగంగానే ఈ వ్యవహారాన్ని చూడాలని న్యాయనిపుణులు ఉదహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని స్థానిక సంస్థల్లో నిలబెట్టుకోవాలనే చిత్తశుద్ధి లేదని తాము మొదటి నుంచీ చెబుతున్నామని వారు పేర్కొంటున్నారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగానే రిజర్వేషన్ల కోసం జీవో విడుదల చేయడం, న్యాయస్థానం ముందు ఆ కసరత్తు నిలవదని తెలిసే ఉద్దేశపూర్వకంగా బీసీలను పక్కదారి పట్టించిందని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తాము ప్రయత్నం చేశామని, విపక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అలా చేయలేకపోయామనే సాకును కాంగ్రెస్ సర్కార్ వెతుక్కోవడంలో భాగమేనని తాము మొదటి నుంచీ చెబుతున్నామని అంటున్నారు.
హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం తేలకుండానే కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నదని, అందులో భాగంగానే హడావుడి జీవో విడుదల.. మార్గదర్శకాల జారీ.. ఆ పరిణామాలకు అనుగుణంగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ పీఠాలు, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల కేటాయింపు కోసం డ్రా తీస్తున్నారనే ప్రత్యేక కథనాన్ని గత నెల 28న ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించింది. ఆయా స్థానాల కేటాయింపు కోసం చేసిన ఎత్తుగడ ఉత్తదేననే అనుమానాన్ని ఆ కథనం వ్యక్తం చేసింది. ‘స్థానిక’ ఖరారు ‘డ్రా’పేనా అని ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడడం, నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ గెజిట్ జారీ చేయడం జరిగిపోయాయి. దీంతో ఇన్ని రోజులు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహుల్లో నైరాశ్యం చోటు చేసుకుంది.
ఆరు నూరైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హంగామా వెనుక చిత్తశుద్ధిలేమి కొట్టొచ్చినట్టు కనిపించిందని జరిగిన పరిణామాలు తేల్చి చెబుతున్నాయని బీసీ వర్గాల మండిపడుతున్నాయి. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన బిల్లుపై గవర్నర్ ఆమోదించకుండానే కాంగ్రెస్ సర్కార్ జీవో విడుదల చేయడం, దానికి అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించి అందరినీ నమ్మించింది. సర్కార్ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు.. డ్రా తీయడం వంటి పరిణామాలు శరవేగంగా చేపట్టింది.
మండల ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) స్థానాల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే కసరత్తు చేసింది. రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన కేసు హైకోర్టు పరిధిలో ఉన్నా.. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశామని, ఎన్నికలు నిర్వహించేందుకే తాము కట్టుబడి ఉన్నామని నమ్మించేందుకు కాంగ్రెస్ పార్టీ యథాశక్తి నాటకాన్ని రక్తికట్టించిందనే విషయం హైకోర్టు స్టే విధించిన మరుక్షణమే సాధారణ బీసీ వర్గాలు గుర్తించాయి.