నమస్తే నెట్వర్క్, మే 21 : ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన వర్షం రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. పరదాలు కప్పినప్పటికీ 90 శాతం ధాన్యం వర్షార్పణమైంది. కొన్ని చోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. మాయిశ్చర్ పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో ధాన్యం తడిసి నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పలు చోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పిడుగు పా టుకు ఇద్దరు మృతి చెందారు. హనుమకొండ, వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు నిలవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. హనుమకొండలో 17.5 మి.మీ, వరంగల్ జిల్లాలో 18.3 మి.మీ వర్షపాతం నమోదైంది. నర్సంపేట మండలంలో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసింది.
వరదకు వడ్లు కొట్టుకుపోయాయి. చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, వర్ధన్నపేట, సంగెం, శాయంపేట మండలాల్లోని కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. తూకం వేసిన బస్తాలు కూడా తడిసిపోయాయ ని రైతులు వాపోయారు. మహబూబాబాద్, కేసముద్రం, కొత్తగూడ, తొర్రూరు, నర్సింహులపేట, పెద్దవంగర మండలాల్లో కొనుగోలు కోసం తీసుకొచ్చిన ధాన్యంతో పాటు కాంటాలు వేసిన బస్తాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. తొర్రూరు-నర్సంపేట రహదారిపై చెట్టు విరిగి పడి కొద్దిసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో ధాన్యం రాశులు, బస్తాలపై రైతులు టార్పాలిన్ షీట్లు కప్పి కాపాడుకున్నారు. కొడకండ్ల, చిల్పూరు మండలాల్లో లారీలు సరిగ్గా రాక, ధాన్యం నింపడానికి బస్తాలు లేక కొనుగోలు చేయడం లేదని, వర్షంతో తడిసి నష్టపోయామని రైతులు లబోదిబోమన్నారు.
పిడుగు పడి ఇద్దరు దుర్మరణం
గూడూరు/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మైదం ప్రవీణ్ (30) పని నిమిత్తం బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వర్షం రావడంతో చెట్టు కింద నిలుచున్నాడు. సమీపంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఉపాధి హామీ పథకంలో భాగంగా గుండెంగ గ్రామ పంచాయతీ లో చెట్లకు నీటిని అందించే పనిచేస్తున్నాడు. ప్రవీణ్‌కు తండ్రి సారయ్య, సోదరుడు ఉన్నారు. అదేవిధంగా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఏశబోయిన చేరాలు(60) గొర్రెలను తీసుకొని మేత కోసం వెళ్లాడు. వర్షంతోపాటు పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఐల్లమ్మ, పిల్లలు ఉన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అమీన్‌పేటలో పిడుగు పాటుకు చిలుకూరి సారమ్మకు చెందిన పాడి గేదె మృతి చెందింది.