Montha Cyclone | ఖిలావరంగల్, అక్టోబర్ 29: మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు జిల్లాలో వర్షాలు స్తంభించాయి. ఆకాశానికి చిల్లుపడిందా అనిపించేంతగా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖిలావరంగల్ రాతికోట అగడ్త ఉధృతికి శివనగర్, మైసయ్యనగర్లోని పలు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. రోడ్లపై మోకాలు లోతు నీరు ప్రవహించడంతో పలు ఇండ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి పోయాయి. మైసయ్యనగర్‌లో సుమారు 50 ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేయకుండానే అధికారులు వరద బాధితులకు భోజనం అందించారు. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి వరద చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేసి అండర్ బ్రిడ్జి రహదారిని మూసి వేశారు.
వరంగల్ రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లపై మొంథా తుపాన్ తీవ్ర ప్రభావం చూపించింది. వరంగల్ రైల్వేస్టేషన్‌కు భారీగా నీరు చేరింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును వరంగల్ రైల్వేస్టేషన్లోనే నిలిపి వేశారు. అలాగే, వరంగల్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే కృష్ణా, కోణార్క్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పగిడిపల్లి మీదుగా మళ్లించారు. రద్దు అయిన రైళ్ల ప్రయాణికులకు టికెట్ డబ్బులు రిఫండ్ చేశారు. మహబూబాబాద్, కేసముంద్రం, ఇంటికన్నె, నెక్కొండ, గార్ల తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. అలాగే, హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులను పుష్పుల్ ద్వారా తరలించారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా వరంగల్ రైల్వేస్టేషన్లో ఉన్న ప్రయాణికులకు ఆహార పదార్థాలను తక్కువ ధరకు అందించారు.
ఎడతెరిపి లేకుండా కురిస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన పంటలు వర్షాలకు ధ్వంసం కావడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. వరి, పత్తి, ఆకు కూరలు, కూరగాయల రైతులను మొంథా తుఫాను నిండా ముంచింది. జిల్లాలో రెడ్ అలెర్ట్ కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసర ప్రయాణాలు మినహా మిగతా వాటిని వాయిదా వేసుకోవాలని రైల్వే అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం కోరింది.