సత్తుపల్లిటౌన్, ఫిబ్రవరి 24 : ఆర్థిక నేరాలకు పాల్పడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేసులో కీలక నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరితోపాటు మరో 13 మంది సైబర్ ముఠాసభ్యులను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఓ సైబర్ బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 23న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండకు చెందిన ఉడతనేని వికాస్చౌదరితోపాటు ఆయన భార్య బొప్పన నాగప్రియ, ముష్టిబండకు చెందిన అడపా రామవెంకటచరణ్ చౌదరి అలియాస్ చరణ్‌పై కేసు నమోదు చేసి, వికాస్ చౌదరిని రిమాండ్‌కు పంపినట్టు పేరొన్నారు. 2020 నుంచి వికాస్ చౌదరి, ఆయన భార్య నాగప్రియ గేమింగ్, బెట్టింగులు ఆడటంతోపాటు అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో జతకట్టారని పేర్కొన్నారు. స్టాక్ మారెట్లు, క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తున్నామని చెప్పి రూ.580 కోట్ల వరకు దోచుకున్నారని పేర్కొన్నారు.
వికాస్చౌదరితోపాటు అడపా రామవెంకటచరణ్ చౌదరి, అడపా సూర్యవెంకటతరుణ్, ఇలాసారపు అనిరుధ్, పోట్రు వంశీ, పోట్రు చైతన్య సాయి, దోసపాటి నవీన్, నల్లబోతుల భవానీసత్యశేఖర్, కాపుగంటి జోగేంద్రశేషు, దేవళ్ల వేణు, మామిడిశెట్టి సాయికుమార్, పఠాన్ ఇమ్రాన్ ఖాన్, ఉప్పతల గోపి, దొబ్బల వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు వెల్లడించారు. బొప్పన నాగప్రియతోపాటు ఇస్లావత్ లక్ష్మీకళ్యాణ్, శీలం వేణుగోపాలరావు, నల్లంగుల శ్వేతన్, వీరంశెట్టి వంశీ, బిల్లా సాయితరుణ్, సంగం ప్రవీణ్‌కుమార్, భూక్యా తరుణ్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.