మోర్తాడ్/ఆర్మూర్‌టౌన్/రామారెడ్డి (సదాశివనగర్), ఫిబ్రవరి 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంగళవారం ఉమ్మడి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. అక్రమ కేసులు బనాయించి ఆదిలాబాద్ జైలులో నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించేందుకు రామన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి కామారెడ్డి, ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్‌కు బయల్దేరారు.
ఈ నేపథ్యంలో సదాశివనగర్ మండలం కుప్రియాల్, ఆర్మూర్‌తో పాటు పోచంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్‌తో పాటు పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికాయి. కారు నుంచి దిగిన రామన్న.. కార్యకర్తలకు అభివాదం చేసి, వారితో ఆప్యాయంగా మాట్లాడారు. జీవన్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కుప్రియాల్ వద్ద తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన గులాబీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎవరూ భయపడాల్సిన అసవరం లేదని భరోసా ఇచ్చారు.

కార్యకర్తలు తన కుటుంబ సభ్యులని, వారికి ఏ కష్టమొచ్చినా తాము అండగా ఉంటామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జాజాలతో పాటు పార్టీ నేతలు పడిగెల రాజేశ్వర్‌రావు, తానాజీరావు, శివాజీరావు, సాయిరెడ్డి, కార్యకర్తలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
ఆదిలాబాద్‌కు వెళ్తున్న కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డికి మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్‌రోడ్డు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఆర్మూర్‌లో కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని, తెలంగాణలో సభ్య సమాజం తలదించుకునే ఘటనలు చోటు చేసుకుంటున్నా అటు ప్రభు త్వం కానీ, ఇటు అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకునే వాళ్లమని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.