నమస్తే నెట్వర్క్, జూలై 25 : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. జలాశయాలు కళకళలాడుతు న్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లాలోని సర్వాపురం-జగ్గన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న బొగ్గుల వాగు ఎగువ ప్రాంతంలోని లోలెవల్ వంతెన మీదుగా వరద ఉధృతంగా ప్రవహి స్తున్నది. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అంకన్నగూడెం-సర్వాపురం గ్రామాల హైలెవల్ వంతె న మీదుగా వెళ్తున్నారు. ఏటూరునాగారం మండలం దొడ్ల, ఎలిశెట్టిపల్లి వాగుల వద్ద రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి.
ఇక్కడ వాగుల వద్ద బోట్లు ఏర్పాటు చేసినప్పటికీ రాత్రి వేళ ఇబ్బందిగానే మారుతోంది. ఇక మల్యాల, కొండాయి గ్రా మాల గిరిజనుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి సమీపంలోని గుండ్లవాగు ప్రాజెక్టు అలుగు పోస్తున్నది. భారీగా వరద నీరు చేరడంతో బొగత జలపాతం సందర్శన నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు, గార్లలోని కుంటలు నిండాయి. బయ్యారం ఏజెన్సీలోని గ్రామాలు జలమయమయ్యాయి.
మసివాగు, పంది పంపుల వాగుల ఉధృతితో సుద్దరేవు కంబాలపల్లి, కిష్టాపురం, కొయ్యగూడెం మధ్య రాకపోకలు బందయ్యాయి. భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ ఓపెన్ కాస్టు 2, 3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు రోజుల్లో దాదాపు రూ.3 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో మోస్తరు జల్లులు కురిశాయి. హనుమకొండ, వరంగల్ నగరంలో ఎడతెగకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమా దం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్లు 18004251980, 9701999645ల ను అందుబాటులో ఉంచారు. 27 మంది సభ్యులతో నాలుగు డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఎంజీఎం దవాఖాన వార్డుల్లోకి వరద నీరు చేరింది. పాకాల సరస్సు నీటిమట్టం 23.5 అడుగులకు చేరు కుంది. ఖానాపురం మండలంలోని మనుబోతులగడ్డ గ్రామంలో ఓ ఇంటి గోడలు కూలిపోయాయి.
కాళేశ్వరంలో గోదావరి నదీ ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం 7.930 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నదని సీడబ్ల్యూసీ అధికారు లు తెలిపారు. వాజేడు మండలం పేరూరు వద్ద 13.23 మీట ర్లకు(42 అడుగులు) నీటిమట్టం చేరుకుంది. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద 3 లక్షల 40 వేల 920 క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారు లు తెలిపారు.
మొత్తం 59 గేట్లకు 24 గేట్లను ఎత్తి 3,88,370 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ ఇన్ఫ్లో 2,50, 880 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్త్తుత నీటి ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుండి సముద్ర మట్టానికి 91.90 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తున్నది. గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.