హనుమకొండ/ఏటూరునాగారం/దుగ్గొండి, సెప్టెంబర్ 22 : ఉమ్మడి జిల్లాలో సోమవారం సాయంత్రం అక్కడక్కడా జోరు వాన పడింది. హనుమకొండ, వరంగల్‌లో సుమారు గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఏరియాల్లో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. హంటర్‌రోడ్డులోని జూపార్కు, బ్యాంకు కాలనీ, అంబేద్కర్‌నగర్, గోకుల్ నగర్, బాలసముద్రం, కాళోజీ కళాక్షేత్రం, బస్టాండ్, హనుమకొండ చౌరస్తా తదితర ప్రాంతాల్లో రోడ్లు కాలువలుగా మారాయి. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సాయంత్రం వేళ కావడం, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇతరత్రా పనుల ముగించుకొని ఇండ్లలోకి వెళ్లే సమయం కావడంతో అవస్థలు పడ్డారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాకలోని పూసుకుంట సమీపంలో వ్యవసాయ పనులకు ఊకె కృష్ణారావు, పూనెం చిట్టిబాబులు వెళ్లారు. వ్యవసాయం పనుల్లో ఉండగా భారీ వర్షం, ఉరుములు, మెరుపులు రావడం తో పక్కనే ఉన్న చెట్టుకిందకు వచ్చి ఉన్నా రు. ఇదే క్రమంలో పిడుగు పడడంతో కృష్ణారావు(40) అక్కడికక్కడే మృతి చెందగా, పూనెం చిట్టిబాబు గాయపడ్డాడు.
మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కాగా, రాత్రి మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. అదేవిధంగా చిట్టిబాబుకు చికిత్స అందించడంతో కోలుకుంటున్నాడు. అదేవిధంగా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన మెద్దు రాకేశ్(24) తమ వ్యవసాయ బావి వద్ద పనులు ముగించుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.