పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కొద్దిరోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని జనం విలవిల్లాడుతున్నా వారిని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ముఖ్యంగా నగరంలోని లోతట్టు కాలనీలు ముంపునకు గురై ఇంట్లోని వరద చేరడంతో వస్తుసామగ్రి వరద పాలై కనీసం వంట చేసుకోలేక బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ప్రభుత్వ నుంచి సహాయం అటుంచి ఓదార్చునిచ్చే నేతలు కరువయ్యారు. సోమ, మంగళవారాల్లో కుండపోత వానకు నగరం జలమయమై, ఓ వైపు రెడ్ అలర్ట్ జారీ చేసినా కూడా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– హనుమకొండ, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వర్షాకాలం మొదలైనప్పటి నుంచి వరంగల్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో కురిసిన వానలకు అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వంట సరుకులు తడిసి వంట చేసుకోలేని పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా గుడిసెల్లో ఉండే పేదల పరిస్థితి మరీ దయనీయం. వరదతో ఇంటి నిండా బురద చేరింది. ఇలా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వరద బాధితులకు కనీసం సాయం అందించడం లేదు. ఆర్థిక సాయం మాట ఎలా ఉన్నా కనీసం నైతికంగానూ భరోసా కల్పించడం లేదు. నగర పరిధిలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో రెండు రోజుల్లో సగటున 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే తూర్పు నియోజకవర్గంలోనే వరద ప్రభావం ఎక్కువగా ఉన్నది.
అన్ని రకాలుగా నష్టపోయిన ఇక్కడి ప్రజలకు ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం అందడంలేదు. ఇప్పటికీ కనీసం పలకరింపులు దక్కలేదు. రెండు రోజులుగా వానలు కురుస్తున్నా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, దేవాదాయ మంత్రి కొండా సురేఖ.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఇప్పటికీ వరద ప్రాంతాలకు రావడం లేదు. వరదల కారణంగా ఇండ్లు ఖాళీ చేసిన ప్రజలకు కనీస నైతిక ైస్థెర్యం ఇవ్వడం లేదు. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులు అక్కడక్కడా ఆహార పొట్లాలు ఇచ్చి ఫొటోలు దిగడం తప్ప బాధితులకు ప్రభుత్వపరంగా సాయం అందించలేదు. వరదల ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాల్సిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తూర్పులో ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు, పేదల బస్తీలు నీటిలో మునిగాయి. చాలాకాలనీలు జలమయమైనా పేద కుటుంబాలు ఆ ప్రాంతంలోనే ఉంటున్నాయి. వరద చేరిన ఇండ్లను వదలలేక, అక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, రవాణా, కరెంటు సరఫరా వ్యవస్థలను స్తంభించిపోయాయి. అయితే ముంపులో చిక్కుకొని ప్రభుత్వ సాయం కోసం రోజంతా ఎదురుచూస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. వరద బాధితులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రి కొండా సురేఖ కనీసం పలకరించేందుకు కూడా రావడం లేదని వాపోతున్నారు.
సొంత నియోజవకర్గంలోని ప్రజలు వరదలతో కష్టపడుతుంటే మంత్రి సురేఖ హైదరాబాద్లో అటవీ శాఖ సమీక్ష సమావేశంలో ఉన్నారు. రెండు రోజలుగా భారీ వర్షాలు కురుస్తుంటే ఇక్కడి పరిస్థితిపై సమీక్షలో కనీస ప్రస్తావన లేదని ప్రజలు అంటున్నారు. వరదలతో ఇండ్లలో ఉండలేని ప్రజలకు తాత్కాల్కికంగా వసతి, ఆహారం అందించేలా మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధికారులతో నామమాత్రంగా సమీక్షలు సైతం నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల ఆదేశాలతో గ్రేటర్ వరంగల్, జిల్లా యంత్రాంగం వరద ప్రాంతాల్లో కొద్దిపాటి సహాయక చర్యలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరదలను, అధికార యంత్రాంగం పనితీరును పర్యవేక్షించి బాధితులకు అండగా నిలువాల్సి సమయంలో స్థానికంగా లేకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.