దుగ్గొండి, ఏప్రిల్,16 : దుగ్గొండి మండలంలో మంగళవారం రాత్రి భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. పీజీ తండా గ్రామంలో గాలివాన కారణంగా గ్రామానికి చెందిన నునవత్ రాజు నాయక్, శంకర్, రాజుకుమార్, శ్రీనివాస్, రాకేష్తో పాటు పలువురి ఇంటి పైకప్పు రేకులపై రేకులు ఎగిరిపోయాయి. ఇండ్లపై చెట్లు విరిగిడటంతో పలువురు నిరాశ్రయులయ్యారు.
వర్షం కారణంగా మొక్కజొన్న, అరటి, బొప్పాయి, వరి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. కల్లాల వద్ద ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం, వరి ధాన్యం వర్షానికి తడవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. నాచినపల్లి రామాలయం వద్ద 40 అడుగుల ధ్వజస్తంభం నేలకొరిగింది. పంట నష్టం పై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు, బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయాలని పలువురు రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.