ఏటూరునాగారం /మంగపేట/ గోవిందరావుపేట/ వాజేడు/కాటారం, జూన్ 23 : ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, గోవిందరావుపేట మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారంలోనూ సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఇన్ని రోజులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు కొంత ఉపశమనం పొందారు. పలుచోట్ల పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. వాగుల్లో వరద ఉధృతి పెరగడంతో తాత్కాలిక రోడ్లు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఏటూరునాగారం మండలంలో కురిసిన భారీ వర్షానికి జంపన్నవాగులో వరద ఉధృతి పెరగడంతో దొడ్ల-కొండాయి మధ్య ఉన్న తాత్కాలిక మట్టి రోడ్డు తెగిపోయింది. మేడారం జాతర సందర్భంగా వాగుపై రెండు తాత్కాలిక రోడ్ల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు వరదకు కొట్టుకుపోవడంతో మల్యాల, కొండాయి, కొత్తూరు, ఐలాపూర్ గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. అధికారులు కూడా వాగు దాటి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ బోటు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.
అలాగే మంగపేట మండలంలో పడిన వానకు పొలాల్లోకి వరద చేరింది. ఇటీవల పోసిన వరి నారు మడుల్లో నీరు చేరడంతో విత్తనాలు మొలకెత్తక ముందే మురిగిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మారుమూల గిరిజన గ్రామాలైన కొత్తూరు మొట్లగూడెం-బొమ్మాయిగూడెం మధ్య ప్రవహిస్తున్న గౌరారం వాగు ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు, కాటారం, గోవిందరావుపేట మండలాల్లో వర్షం పడడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాన పడడంతో రైతులు పొలం పనులను ముమ్మరం చేస్తుండగా.. ఇటీవల పలు చోట్ల వేసిన పత్తి పంటకు ప్రాణం పోసినట్లయిందని పలువురు సంబురపడుతున్నారు.

నిలిచిన సిల్ట్ తొలగింపు పనులు
కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజె క్టు వద్ద ఆదివారం కురిసిన వర్షానికి సిల్ట్ తొలగింపు పనులు నిలిచిపోయాయి. గోదావరి నుంచి దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వరకున్న కాల్వలో రెండేళ్లుగా సిల్ట్ తొలగించకపోవడంతో ఫోర్వేలో 3 మీటర్ల ఎత్తుతో ఇసుక, చెత్తా చెదారం నిండిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా పూర్తి సిల్ట్ తొలగించాలని పనులు మొదలుపెట్టినప్పటికీ వర్షాలు మొదలవ్వడంతో ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తున్నది. అయితే తొలగించిన సిల్ట్‌ను పక్కనే పోయడంతో వరదకు కాల్వ నిండిపోయే అవకాశం ఉంది. దీనిపై దేవాదుల డీఈ శరత్‌ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
