Harish Rao | వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబులు పూర్తయిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోందని హరీష్ రావు అన్నారు. 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సింది. కేసీఆర్ ఉండి ఉంటే ఈ పాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది.
కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దసరాలు పోయి మూడో దసరా వస్తున్నా కదలడం లేదు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ. కేసీఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శాతం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవి.రోగుల బంధువుల కోసం కేసీఆర్ ధర్మశాల నిర్మించాలని నిర్ణయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సగానికి సగం తగ్గించింది.రోడ్ నెట్వర్క్, ఎలివేషన్ వర్క్స్ అన్నీ తగ్గించేశారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యం. ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బీఆర్ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టింది.
ఓపీ చూడ్డానికి ఈ హాస్పిటల్ ఎందుకు..?
కానీ మీరు డిజైన్ల మార్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదు. జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సులు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కావాలి. ఇంతవరకు రిక్రూట్మెంట్కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా..? నోటిఫికేషన్ ఇచ్చారా..? కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు..? పేపర్లలో చూస్తే ‘ఓపీ సేవలు’ ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా..? లేక బస్తీ దవాఖానానా..? ఓపీ చూడ్డానికి ఈ హాస్పిటల్ ఎందుకు..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టాం. దీన్ని కూడా మరో బస్తీ దవాఖానా చేయకండి. వెంటనే ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలి.
లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతాం. ఉత్తర తెలంగాణకు సంజీవని లాంటి వరంగల్ లో ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా మారిందని హరీష్ రావు అన్నారు. వరంగల్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు సోయి ఉందా.. ? ఎంజీఎం పరిస్థితి చూస్తే వార్తలు రాసి రాసి పత్రికా విలేకరులే విసిగిపోయారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు వరంగల్ వచ్చినా ఒక్కసారైనా ఎంజీఎంను చూశారా..? అని హరీష్‌రావు ప్రశ్నించారు.
రెండున్నరేళ్లలో ఆరోగ్య మంత్రి అటువైపు వెళ్లారా..? ఎంజీఎం ఇప్పుడు ఎలుకలు, పందికొక్కులకు నివాసంగా మారింది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు, మంచాలు లేవు. టెస్టులకు మెటీరియల్ లేదు. బీఆర్ఎస్ హయాంలో ఎంజీఎంలో 250 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశాం. కానీ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లలో ఏసీలో నీళ్లు కారుతున్నాయని థియేటర్లనే మూసేశారు. రోగులను హైదరాబాద్ కు పంపిస్తున్నారు. మేము కేథలాబ్ లు, మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మీ చేతిలో పెడితే, వాటిని నడిపించే సత్తా కూడా మీకు లేదన్నారు.
పాత కబుర్లనే తీపి కబుర్లుగా..
ఎక్స్‌రే మిషన్లు పనిచేయవు. ఆయుష్ ఆసుపత్రిలో మందులు లేవు. ఎంజీఎంను తక్షణమే సమీక్షించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పాత కబుర్లనే తీపి కబుర్లుగా సీఎం చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో మైసయ్య అనే రిటైర్డ్ ఎస్సై వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పీఆర్సీ అమలు చేసి, బకాయిలు చెల్లించండి.
నిన్న వరంగల్‌లో కార్పొరేటర్లను, మొన్న బాల్క సుమన్‌ను, ఆమన్‌గల్లులో బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. కక్షలు కట్టడం కాదు, ముందు ఆసుపత్రి కట్టు రేవంత్ రెడ్డి. ఆసుపత్రి పూర్తయితే కొన్ని వేల మంది పేదలకు వైద్యం దొరుకుతుంది. కేసీఆర్ మీద పడి ఏడ్వడం మానేసి, 20 లక్షల స్క్వేర్ ఫీట్స్ తో కడుతున్న ఈ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ పర్యటనలో హరీష్ రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
LIVE : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
https://t.co/mnOYVrVT3d— BRS Party (@BRSparty) February 24, 2026
‘డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి’
Cinema Is Dead | రాజమౌళితో మహేశ్ బాబు ఫైటింగ్.. AIతో సినిమా చనిపోయిందంటూ వర్మ పోస్ట్