చండ్రుగొండ, సెప్టెంబర్ 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయ్యగూడెం గ్రామానికి వెళ్లే రహదారిపై బ్రిడ్జి నిర్మాణ పనులను గత ఏడాది జూన్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. రూ.3.20 కోట్ల అంచనా వ్యయంతో సిఆర్ఆర్ గ్రాంట్లు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణ పనులకు టెండర్లు సైతం పూర్తి అయ్యాయి. నిర్మాణ పనులకు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇప్పటివరకు కనీసం పనులు ప్రారంభించ లేదు. రాష్ట్ర మంత్రి సైతం తాను ఇచ్చిన మాట పోతుందనే రివ్యూ చేయకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు నెలల్లోనే నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ శంకుస్థాపన చేసి కూడా ఏడాదిన్నర అయినా ఇంకా పనులు ప్రారంభం కాకపోవడం పట్ల మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే సంయుక్తంగా ప్రారంభించే పనులకే దిక్కులేకపోవడం పట్ల అంతా విస్మయం చేస్తున్నారు.