Flight charges : దీపావళి పండగ (Diwali Fest) ను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోవడానికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు విమానయాన సంస్థలు గట్టి షాకిస్తున్నాయి. పండగ డిమాండ్, పెరిగిన ఇంధన ధరల (Fuel price) కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణచార్జీలు ఆకాశాన్నంటాయి. దాంతో పండగ ప్రయాణం సామాన్యుడికి పెనుభారంగా మారింది. గతంతో పోలిస్తే టికెట్ల ధరలు చాలా రూట్లలో రెట్టింపు కంటే అధికంగా ఉండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దేశీయంగా ప్రధాన నగరాల మధ్య ప్రయాణ చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఉదాహరణకు అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ-బెంగళూరు మార్గంలో రెండు సంవత్సరాల క్రితం రౌండ్-ట్రిప్ టికెట్ ధర సుమారు రూ.13,000 ఉండగా.. ఇప్పుడు పండగ సీజన్లో అది రూ.20,000 దాటిపోతోంది. కొన్ని మార్గాలలో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సాధారణ రోజులతో పోలిస్తే కొన్ని రూట్లలో ఏకంగా 300 శాతానికిపైగా ధరలు పెరిగాయి. దుర్గపూజ సమయంలో కోల్‌కతా-దే మార్గంలో సాధారణంగా రూ.2,800 ఉండే టికెట్ ధర ఏకంగా రూ.12,500 కి చేరడం దీనికి నిదర్శనం.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా యూఏఈ నుంచి భారత్‌కు వచ్చే విమాన సర్వీసుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నవంబర్ 5న దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చే విమాన టికెట్ ధర ఎయిర్‌లైన్‌ను బట్టి సుమారు 1,013 (రూ.26,424) నుంచి 1,214 దిర్హమ్ (రూ.31,667) ల వరకు పలుకుతోంది. అబుదాబి, షార్జా నుంచి బయలుదేరే విమానాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో ధరలు ఉన్నాయి. విమాన చార్జీల పెరుగుదలకు ప్రధానంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరగడమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఏటీఎఫ్ ధర లీటర్‌పై రూ.6.28 (5.46 శాతం) పెరిగి రూ.121.28 కి చేరింది. దీనికితోడు అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాన్ని పెంచుతోంది. పండగ సీజన్లో టికెట్లకు ఉండే అధిక డిమాండ్‌ను కూడా సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ చార్జీల మోతపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పండగ బడ్జెట్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు కొన్ని సూచనలను అందిస్తున్నాయి. ముందుగానే టికెట్ ధరల అలర్ట్ సెట్ చేసుకోవడం, వారాంతాలకు బదులుగా వారం మధ్య రోజుల్లో ప్రయాణించడం, సాధ్యమైతే పండగ రోజునే ప్రయాణం పెట్టుకోవడం, లగేజీ తగ్గించుకోవడం, సమీపంలోని విమానాశ్రయాలను పరిశీలించడం లేదా రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని సూచిస్తున్నాయి.