నర్సంపేట, మే 11 : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో నేలమట్టమైన శివాలయంతో పాటు మట్టికోటను పునర్నిర్మించాలని శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి తవ్వకాలు జరిపారని, ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. సోమవారం ఆయన అశోక్‌నగర్‌లో కాకతీయులు నిర్మించి ఇటీవల కూల్చివేతకు గురైన అతిపురాతన శివాలయం, మట్టి కోటను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దా స్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, బానోత్ శంకర్‌నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మర్రి యాదవరెడ్డితో కలిసి పరిశీలించారు.
తొలుత ధ్వంసమైన మట్టికోటను, అనంతరం కూల్చివేసిన శివాలయానికి సంబంధించిన శిలలు, శిల్పాలు, కట్టడాలు, శాసనాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ధ్వంసమైన గర్భగుడి ప్రాంతంలో పసుపు, కుంకుమ, పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నాయకులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద మొత్తం లో ఓం నమఃశివాయ అంటూ భక్తిభావాన్ని ప్రదర్శించారు. అనంతరం మట్టికోట బయట ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై వారు ధ్వజమెత్తారు. అశోక్‌నగర్‌లో ప్రభు త్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పాటు శివాలయం, మట్టికోట నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటన నేపధ్యంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అశోక్‌నగర్‌లో నేలమట్టమైన శివాలయం పరిసరాల్లో బీఆర్ఎస్ నాయకులు టెంట్ వేసేందుకు సిద్ధం కాగా, నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ, ఎస్సై గుగులోత్ రాంమోహన్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్ది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు శివాలయం వద్ద టెంట్ వేసేందుకు ససేమిరా అనడంతో చేసేది లేక మట్టి కోట బయట వేశారు.
అక్కడే కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, నాయకులు నల్లా మనోహర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, తక్కళ్లపెల్లి రవీందర్రావు, మాజీ ఎంపీపీలు జక్క అశోక్‌యాదవ్, వేములపల్లి ప్రకాష్‌రావు, నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, నామాల సత్యనారాయణ, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, పొన్నం మొగిళి, గోనె యువరాజ్, మండల శ్రీనివాస్, నాగిశెట్టి ప్రసాద్, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, బానోత్ సారంగపాణి, చెట్టుపల్లి మురళీధర్, ఊడ్గుల ప్రవీణ్, శానబోయిన రాజ్‌కుమార్, కొమ్ము రమేశ్‌యాదవ్, దేవినేని వేణుకృష్ణ, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేశ్, ఉప సర్పంచ్ ఉప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.
కాకతీయుల కాలం నాటి చారిత్రక శివాలయ విధ్వంసానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. కూల్చివేతపై వెంటనే విచారణ జరపాలి. ఖిలావరంగల్ కోట నుంచి అశోక్‌నగర్ శివాలయం వరకు సొరంగ మార్గం ఉన్న చారిత్రక వాస్తవాన్ని కాంగ్రెస్ సర్కార్ మార్చాలని చూస్తున్నది. 800 ఏళ్ల పైబడిన చరిత్రను ప్రభుత్వం కాలరాస్తున్నది. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి కాలంలో నిర్మించిన చారిత్రాత్మక శివాలయాన్ని కూల్చివేయడం దారుణం.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో పురావస్తు శాఖ పరిధిలోని వారసత్వ సంపదను ధ్వంసం చేయడం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హస్తం ఉంది. మట్టికోట మధ్యలో ఉన్న శివాలయం పురావస్తు శాఖ ఆస్తి. స్కూల్ నిర్మాణం ముసుగులో అర్ధరాత్రి దానిని ముక్కలు చేశారు. శివాలయం విధ్వంసంపై ఇప్పటి వరకు కాంట్రాక్టర్, అధికారుల మీద క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు కాలేదు? దోచుకున్న సంపద మొత్తం రికవరీ చేసి శివాలయాన్ని పునర్నిర్మించాలి. బాధ్యులైన ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కాకతీయులు పాకాల, లక్నవరం, రామప్ప చెరువులు కట్టి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేశారు.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాం. వేయిస్తంభాల ఆలయాన్ని సైతం గత ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకున్నాం. కాకతీయుల కాలం నాటి అనేక దేవాలయాలను 70 ఏళ్లుగా పట్టించుకోకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఆలయాలను బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ కూలగొట్టొందు. అశోక్‌నగర్‌లోని శివాలయంలో లంకెబిందెలు దొరుకుతాయని సీఎం రేవంత్‌రెడ్డి అనుకున్నాడు. ఇక్కడి మట్టికోట ఖిలావరంగల్ కోటను పోలి ఉంది. ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. కట్టను విధ్వంసం చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన పాపాలు చాలా ఉన్నాయి. రైతులను మోసం చేయడంతో పాటు గుళ్లను ధ్వంసం చేశాడు. తక్షణమే సీఎం బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి. గతంలో గుళ్ల చుట్టూ తిరిగి చేసిన అబద్ధపు ప్రమాణాల పాపం ఊరికే పోదు.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి