అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ నాయకులు వాడవాడలా పండుగ వాతావరణంలో మహిళలకు క్రీడోత్సవాలు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, వడ్డీలేని రుణాలు అందజేశారు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి, వరంగల్ 43వ డివిజన్ పరిధిలోని బొల్లికుంట సమీపంలోని ఫంక్షన్‌హాళ్లలో, రాయపర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు వివిధ క్రీడలు నిర్వహించారు. ఆరు వేల మందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
– వరంగల్, మార్చి 8(నమస్తేతెలంగాణ)
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అతివల సంబురం అంబరాన్నంటింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతటా మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగాయి. పలుచోట్ల ఆడబిడ్డలు ర్యాలీలు, మానవహారాలతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆటల పోటీలు, ఫ్యాషన్ షోలు, నృత్య ప్రదర్శనలతో ఉల్లాసంగా గడిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్త్రీ, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రముఖులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. హనుమకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, దామెరలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఇల్లంద, ఖిలావరంగల్ మండలం మామునూరు, రాయపర్తిలో జరిగిన వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ పసునూరి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి పాల్గొన్నారు. నర్సంపేట పట్టణం, ఖానాపురం, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ, నల్లబెల్లిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మానుకోటలోని యశోద గార్డెన్లో జరిగిన వేడుకల్లో మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కలెక్టర్ శశాంక, మరిపెడ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్, భూపాలపల్లి సింగరేణి ఫంక్షన్హాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, కలెక్టర్ భవేశ్ మిశ్రా, వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ములుగులో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, పాగాల పాల్గొన్నారు.
పరకాలలో స్వర్గరథం డ్రైవర్‌గా సేవలందిస్తున్న మందల మమత మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు అందుకుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా, శిశు, దివ్యాంగుల అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ ఆమెకు బహుమతి ప్రదానం చేశారు.