హనుమకొండ, ఏప్రిల్ 22 : హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో సత్తాచాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకును సాధించాడు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకునిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. కాగా ఈయన గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించి ఐపీఎస్‌లో చేరి ప్రస్తుతం నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా డెహ్రాడూన్‌లో ఉన్న జయసింహారెడ్డిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
దీంతో తండ్రి ఉమారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు కుమారుల్లో జయసింహారెడ్డి చిన్నవాడు. పెద్ద కుమారుడు మనీష్చంద్రారెడ్డి కాలీఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఐఐటీలో ఎలక్టికల్ ఇంజినీర్ కోర్సు పూర్తి చేసారు. చిన్న కుమారుడు ఐపీఎస్ శిక్షణ పొందుతున్నప్పటికి ఐఏఏఎస్ కావాలనే సంకల్పంతో మరోసారి సివిల్స్‌కు స్వతహాగా ప్రిపేర్ అయి ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ర్యాంకు సాధించిన జయసింహారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.
పోతరాజు హరిప్రసాద్‌కు 255 ర్యాంకు
హనుమకొండ బాలసముద్రంకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255 ర్యాంక్ సాధించారు. ఈయన గతంలో రెండు సార్లు సివిల్స్ రాయగా ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. ఈ సారి పట్టుదలతో చదివి ర్యాంకు సాధించారు. కాగా హరిప్రసాద్ సొంత గ్రామం ఆత్మకూర్ మండలం నీరుకుళ్ల. తండ్రి పోతరాజు కిషన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి విజయ గృహిణి. ఈయన అన్న శివప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
వీరి పాఠశాల విద్య హనుమకొండలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో పూర్తి చేసి ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేసారు. ఆ తర్వాత హరిప్రసాద్ జపాన్‌లో డైకిన్ ఏసీ కంపెనీలో రీసెర్చ్ ఇంజినీర్‌గా రెండు సంవత్సరాలు పనిచేసారు. కరోనా సమయంలో ఇక్కడి వచ్చి ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండా ఇంటిలో నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. ఈ సంవత్సరం వెలువడ్డ ఫలితాల్లో 255 ర్యాంకు సాధించారు. ఐఏఏస్ వస్తుందనే నమ్మకాన్ని వెలుబుచ్చారు.