నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 8 : నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 102 సెంటర్లు కేటాయించారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9గంటల నుంచి అనుమతిస్తారు. 10గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేస్తారు. 10 తర్వాత ఒక సెకన్ ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించరు.
పరీక్ష హాల్లోనికి మొబైల్ ఫోన్స్, స్మార్ట్‌వాచ్, క్యాలిక్యులేటర్, వైట్ పేపర్స్, పెన్ డ్రైవ్, టాబ్లెట్, హియరింగ్ ఫోన్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అభ్యర్థుల చేతులకు మెహందీ, టాటూలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పరీక్ష ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకుగాను పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
అలాగే పరీక్ష కేంద్రానికి సమీపంలో ఉంటే జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకుగాను రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్కాడ్, ప్రతి సెంటర్‌కు డిపార్ట్మెంట్ ఆఫీసర్‌ను నియమించినట్లు అధికారులు తెలిపారు. హనుమకొండలో 45, వరంగల్‌లో 17, జనగామలో 11, భూపాలపల్లిలో 17, మహబూబాబాద్‌లో 12 సెంటర్లలో ఏర్పాట్లుచేశారు. జిల్లాలవారీగా హనుమకొండలో 22,665, జనగామలో 3,697, వరంగల్‌లో 9,092, మహబూబాబాద్‌లో 4,412, భూపాలపల్లిలో 4,394 మంది పరీక్షకు హాజరుకానున్నారు.