జనగామ, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలతో జనగామ జిల్లా రైతులకు మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దేవాదుల రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీరులేకపోవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుభవించిన కరువు రోజులు మళ్లీ కండ్ల ముందు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎర్రటి ఎండల్లోనూ నిండు కుండలా మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు నేడు ఎడారిని తలపిస్తున్నాయి. బోర్లు వేస్తే 80 ఫీట్ల లోతులోనే ఉబికి వచ్చే నీటి జాడలు ఇప్పుడు ఏకంగా 14.80 మీటర్ల లోతుకు పడిపోయాయి. అదనుకు తడి అందక పొలాలు నెర్రెలు బారుతుండగా.. మొన్నటి వరకు పచ్చగా ఉన్న పంటలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు పశువులు, జీవాల మేతకు వదిలేస్తున్నారు.
జనగామ జిల్లాలో యాసంగిలో ప్రధానంగా వరి పంట సాగవుతుండగా, నీటి వినియోగం రోజురోజుకు పెరుగుతున్నది. వానకాలం ఆరంభంలో వర్షాలు లేకపోవడంతో రైతులు వరి పంట వేయడం కష్టంగా మారింది. గత ఏడాది ఆగస్టులో కొంత మేర వర్షాలు కురిశాయి. వరి కోతలు మొదలయ్యాక నవంబర్‌లో తుపాను వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో జనగామ జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరిగింది.
యాసంగి ఆరంభానికి ముందు పుష్కలంగా నీటి మట్టాలుండగా, గత రెండు నెలల్లో అవి అమాంతం పడిపోతున్నాయి. వరి సాగు చేసిన రైతులకు మరో 40-50 రోజుల పాటు నీటి వినియోగం ఎక్కువగానే ఉంటుంది. గత ఏడాది ఇదే సమయంలో సగటు భూగర్భ జల మట్టం 16.25 ఉంటే, ఈసారి 14.80 మీటర్లకు పడిపోయింది. జిల్లాలో ప్రస్తుతం రైతులు వరి, మక్కజొన్న, వేరు శనగ, పొగాకు పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి 2.05 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుండడంతో నీటి వాడకం గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా గత డిసెంబర్లో సగటున 2.82 మీటర్లున్న భూగర్భ జలమట్టం జనవరి చివరి నాటికి 5.01, ఫిబ్రవరిలో 14.80 మీటర్లకు పడిపోయింది.
రైతులు తాము వేసిన పంటలకు బావులు, బోర్ల ద్వారా సాగునీరు అందిస్తుండడంతో రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే నీరు లేక పలుచోట్ల 30 శాతం పంటలు ఎండిపోగా.. మరి కొద్దిరోజులు పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏప్రిల్ నాటికి భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. జిల్లాలోని జనగామ, తరిగొప్పుల, లింగాలఘనపురం, రఘునాథపల్లి, కొడకండ్ల, బచ్చన్నపేట మండలాల్లో భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతూ కరువు ఘంటికలు మోగిస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువుకు చిరునామాగా సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తైన డార్క్ ఏరియాగా ముద్రపడి బోర్లువేయడానికి, ఇసుక తీయడానికి వీళ్లేదని నిషేధాజ్ఞలకు గురైన ప్రాంతం జనగామ. తెలంగాణ ఏర్పడిన అనంతరం గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దేవాదుల ద్వారా అందిన సాగునీటితో రికార్డుస్థాయిలో ధాన్యం పండించి పచ్చని కోనసీమ అయ్యింది. ఎండా కాలంలోనూ రిజర్వాయర్ల ద్వారా చెరువులు, కుంటలు, ఇతర చిన్ననీటి వనరులను నింపడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. 90 శాతంకు పైగా గ్రామాల్లో బావులు తవ్వినా, బోర్లు వేసినా 80 నుంచి 100 ఫీట్లలోపే నీరు ఉబికివచ్చేది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జనగామ జిల్లాకు దేవాదుల నీటి పంపింగ్ ఆగిపోవడంతో నర్మెట మండలం బొమ్మకూరు, లింగాలఘనపురం మండలం నవాబుపేట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఆర్ఎస్ ఘన్పూర్, రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు చెరువులు, కుంటలు ఎండిపోయి, బోర్లు, బావులు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. దేవాదుల కాల్వలకు నీరు వదలకపోవడంతో వాటిలో తుమ్మలు, పిచ్చి చెట్లు పెరుగుతున్నాయి. కేవలం రెండు నెలల్లోనే జిల్లాలో నీటి మట్టాలు దారుణంగా పడిపోయి కరువు కాలం తరుముకొస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దేవాదుల ద్వారా రిజర్వాయర్లు నింపి చెరువులు, కుంటలకు తరలిస్తే తప్ప యాసంగి పంటలు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు.
దేవరుప్పుల : చింతకుంటలో నీళ్లు ఉండడంతో యాసంగి పంట పండుతదని రెండెకరాలు నాటు పెట్టిన. వరి కంకుల మీద ఉంది. బోర్ల నీరు అడుగంటి పంట ఎండిపోతున్నది. బోర్లు వేసినా పడుతలేవు. ఇగ పశువులను మేపుడే మిగిలింది. అప్పు జేసి రూ. 50 వేల పెట్టుబడి పెట్టిన. చెరువుల నీరు ఉంటే కొంత ప్రయోజనం ఉండేది. కుంట కింద ఉన్న రైతుల వరి చేన్లు ఇంక పది రోజులైతే ఎండిపోతయి.
– ధరావత్ లక్ష్మణ్, రైతు, బోడకుంట తండా
దేవరుప్పుల : రెండెకరాల్లో వరి నాటు పెట్టిన. ఒక్క పది రోజులు నీరు పారితే పంట చేతికొచ్చేది. పొలమంతా ఈనింది. నీళ్లు లేక తాలుపోతున్నది. రెండు వరుస తడులు అందినా బయట పడుదును. బోర్లు పోస్తలేవు. రూ. 60 వేలు ఖర్చు పెట్టి రెండు బోర్లేసినా ఒక్కటి పడలే. చేసేది లేక పశువులను మేపుతున్న. నీళ్లు పాతాళానికి పోయి వందల ఎకరాల్లో వరి ఎండుతున్నది. ఈసారి అప్పుల పాలే.
-బబ్బూరి మహేందర్, రైతు, దేవరుప్పుల