ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. సోమవారం ఉదయం నుంచే తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చిన ఆడబిడ్డలు, సాయంత్రం కూడళ్లు, ఆలయాలు, చెరువు గట్ల వద్ద ఉంచి ఆడిపాడి ఊరూవాడా హోరెత్తించారు. అనంతరం బతుకమ్మలను వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..’ అంటూ మొదలుపెట్టి, ‘పోయిరా గౌర మ్మ పోయిరావమ్మా..’ అంటూ వీడ్కోలు పలకడంతో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు సాగిన ‘పూల జాతర’ ఘనంగా ముగిసింది.
కాగా, హనుమకొండలోని పద్మాక్షి గుండం, వడ్డేపల్లి చెరువు, వరంగల్‌లోని రంగలీల మైదానం, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువు, జనగామలోని బతుకమ్మకుంట, మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడి యం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం తదితర చోట్ల ఆడపడుచులు బతుకమ్మలను చేతబూని రాగా ఆయా ప్రాంతాలు పూల వనాలుగా మారాయి.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29