నమస్తే నెట్వర్క్, ఆగస్టు 8: కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాల్సిందేనని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారు విధులు బహిష్కరించి, జీపీ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ సిబ్బందిని మల్టీపర్పస్ విధానం నుంచి విముక్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నేరుగా వేతనాలు అందజేయాలన్నారు. జీవో 51ని రద్దు చేయాలని కోరారు.
పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యం కల్పించాలన్నారు. కారోబార్, బిల్కలెక్టర్లను అసిస్టెంట్ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. సిబ్బందితోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఎం, టీఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.