అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేస్తున్నాయి. ఆఖరి తడికి సాగునీరందకపోయినా అష్టకష్టాలు పడి పండించుకున్న ధాన్యాన్ని అమ్మకానికి తెస్తే వరద పాలైంది. ఆదివారం కురిసిన వడగండ్ల వానతో జనగామ, ములుగు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు వరి, మక్కజొన్న పంటలు నేలవాలగా, కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. పలుచోట్ల మామిడి పంట దెబ్బతిన్నది. జనగామ మార్కెట్లో వరద ధాటికి ధాన్యం అంతా కొట్టుకుపోయి రైతన్నకు కన్నీరే మిగిలింది.
– జనగామ, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)/ ఏటూరునాగారం/మంగపేట
జనగామ జిల్లాలోని జనగామ రూరల్, నర్మెట, తరిగొప్పుల, దేవరుప్పుల తదితర మండలాల్లో ఉరుములు, ఈదురుగాలులతో మోస్తరు వాన కురిసింది. మామిడితోటలకు నష్టం వాటిల్లగా కోతకు వచ్చిన వరి పంట నేలపాలైంది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకాని తెచ్చిన వందలాది ధాన్యం బస్తాలు, ఆరబోసుకున్న వడ్లు తడిసి ముద్దయ్యాయి.
మార్కెట్కు సెలవు ప్రకటించడంతో రేపోమాపో బస్తాలు నింపి అమ్ముకుందామని కుప్పపోసుకొని టార్పాలిన్లు కప్పుకున్న రాశుల చుట్టూ వరద నీరు నిండి చెరువును తలపించింది. వరదలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని నీటి మధ్య నుంచి తోడుకొని మళ్లీ కుప్ప చేసుకునేందుకు రైతుల పడరాని పాట్లు పడ్డారు. తేమ శాతం ఎక్కువ ఉందని వ్యాపారులు కొనుగోలుకు నిరాకరించడంతో రైతులు యార్డులో ఎండబోసుకోగా ఇంతలో వర్షం వచ్చి నిండా ముంచింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాలకు చేర్చిన ధాన్యం కూడా తడిసింది.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం, తాడ్వాయి మండలం, మంగపేట మండలం కమలాపురం, గంపోనిగూడెం, మంగపేట, రేగులగూడెం బోరునర్సాపురం తదితర గ్రామాల్లో ఆదివారం గాలి దుమారంతో పాటు వడగండ్లు కురిశాయి. మిర్చి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఆర బోసిన మిర్చిపై టార్పాలిన్ షీట్లు కప్పుకున్నారు.
కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. కోతదశలో ఉన్న వరి పొలాలు ఈదురు గాలులకు నేలవాలాయి. రెండోసారి కోసిన మిర్చి కూడా తడిసిపోయింది. అలాగే వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కేశవాపురం, ఆరెగూడెం తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం పడి వరి, మక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.