జనగామ, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనేవారు లేక కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. కాంటాలు కాక కొంద రు.. కొనుగోళ్లు జరిగి మిల్లులకు తరలించక మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిసి అన్నదాతలు మరింత నష్టపోతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జనగామ జిల్లాలో 30 నుంచి 45 రోజుల ముందుగానే సాగు పనులు మొదలై సెప్టెంబర్ చివరి నుంచి కోతలు ప్రారంభమవుతాయి.
దీనికి అనుగుణం గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆల స్యం చేస్తున్నారు. సీజన్ ప్రారంభమై దాదాపు 45రోజులు గడుస్తున్నా వారం క్రితం వరకు 30 శాతం కొనుగోలు కేంద్రాలే ప్రారంభించడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోయారు. అయి తే రెండు, మూడు రోజులుగా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ సీఎంఆర్, సన్నధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం రైస్ మిల్లర్లకు విధించిన తాజా ఆంక్షలు జిల్లాలో ధాన్యం సేకరణకు గుదిబండగా మారాయి. సన్నధాన్యం కొనుగోలుకు ఇప్పటికే మిల్లర్లు విముఖత చూపుతుండగా, డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇచ్చే ప్రసక్తేలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
వానకాలం ధాన్యం కేటాయింపు విషయమై పలు నిబంధనలతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 27 కొత్త చిక్కులు తెచ్చింది. మిల్లర్లు బ్యాంకు గ్యా రెంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని, దొ డ్డు రకం ధాన్యం క్వింటాకు రూ. 30, సన్నాలకు రూ. 40 చొప్పున మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తామని, అది కూడా గడువులోపు పూర్తిచేస్తేనే అని అందులో స్పష్టం చేసింది. జిల్లాలో 45 రారైస్, 21 పారా బాయిల్డ్ మిల్లులుండగా, అందులో 6 రారైస్, ఒక పారా బాయిల్డ్ మిల్లు డిఫాల్టర్ జాబితాలో ఉన్నాయి. జిల్లాలో 3,48,0 68 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, 2,67,1 78 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1.10 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరణ లక్ష్యంగా 180 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే సన్న, దొడ్డు రకం కలిపి 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి ఇప్పటి వరకు కేవలం 561 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు.
ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలపై స్పష్టత కోసం కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభయ్యాయి. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ, సెక్యూరిటీ డిపాజిట్ వంటి అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా కలెక్టర్ ఆదేశాలతో నిర్ణీత గడువులోపు వాటిని ఇస్తామని హామీ పత్రాలు తీసుకొని రైస్ మిల్లులకు ట్యాగింగ్ ప్రక్రియ చేపట్టాం. ఒకటి, రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం అవుతాయి.
– హతీరాం, పౌరసరఫరాల శాఖ మేనేజర్, జనగామ జిల్లా
కొత్త జీవో మేరకు క్వింటాకు 67 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం సాధ్యంకాదని, అలా చేస్తే సుమారు రూ. 300కు పైగా నష్టం వస్తుందని రా రైస్ మిల్లర్లు చెబుతున్నారు. దీంతో సీఎంఆర్ కింద సన్న ధాన్యం సేకరణకు విముఖత చూపుతున్నారు. తమకు జరిగే నష్టాన్ని ప్రభుత్వం భరిస్తే తీసుకునేందుకు తాము సిద్ధమని, దీనిపై స్పష్టత వస్తే తప్ప ముందుకు వెళ్లేది లేంటున్నారు. అలాగే పాత మిల్లింగ్ యార్జీలు, ఇతర బకాయిలు ముందుగా చెల్లించాలని, వీటితోపాటు గన్నీ బ్యాగుల విషయంలోనూ స్పష్టత ఇవ్వాలంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పెంచిన మిల్లింగ్ చార్జీలు సరిపోవని, పక్క రాష్ట్రాల్లో పరిశీలించి ఆ మేరకు ఇవ్వాలని కోరుతున్నారు.
కొత్తగా ప్రభుత్వం జారీ చేసి న జీవో 27తో జిల్లాలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు మిల్లర్లు ముందుకు రావడంలేదు. కొన్నిచోట్ల కాంటాలు వేసిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదాంలకు తరలిస్తున్నా, అనేక ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడం తో ఎక్కడి నిల్వలు అక్కడే పేరుకుపోయాయి. మరికొన్ని చోట్ల రైతు లు ధాన్యాన్ని తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వరంగ సంస్థలు పట్టించుకోవడం లేదు.
పాలకుర్తి ప్రాంతంలో రైతులు కొనుగోలు కేం ద్రానికి ధాన్యం తీసుకొచ్చి 10 రోజులు దాటుతున్నా ఇవాళ, రేపు అంటూ అధికారులు దాటవేస్తున్నా రు. అకాల వర్షానికి ఇప్పటికే పలుమార్లు ధాన్యం తడిసి ముద్దయ్యిందని రైతులు వాపోతున్నారు. కాగా, గతంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ చేయక బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లర్లకే బ్యాంకు గ్యా రెంటీలతో ధాన్యాన్ని కేటాయించాలని, సకాలంలో డెలివరీ చేసిన మిల్లులను మినహాయించాలని మి ల్లర్లు కోరుతున్నారు. బ్యాంకు గ్యా రెంటీ, సెక్యూరిటీ డిపాజిట్ వారం, పది రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్‌పై రాసిస్తే మిల్లులకు సీఎంఆర్ కేటాయిస్తామన్న వెసులుబాటును జిల్లా యంత్రాంగం కల్పించినా నేటికీ సగం మంది యజమానులు కూడా ముందుకు రాలేదు.
పాలకుర్తి : మల్లంపల్లిలో ఎఫ్ఎస్సీఎస్ బ్యాం క్ ఆధ్వర్యంలో ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పా టు చేసి పది రోజులైంది. ఇప్పటి వరకు ఏ అధికారి రాలేదు. ఏఈవో లేడు.. ఏవో రాలేదు.. కాంటాలు కావడం లేదు. కనీసం తే మ చూసే వారు లేరు. పైగా ఈ కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రారంభించారు. ఒక్క బస్తా కూడా కాంటా కాలేదు. వర్షం పడగానే పరదాలు కప్పుడు.. ఎండ రాగానే ఆర బోసుడైతాంది ఇక్కడి రైతులకు. అధికారులు స్పందిం చి కోనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి.
– పుర్మ రఘుపాల్‌రెడ్డి, రైతు, మల్లంపల్లి