ఏటూరునాగారం/ములుగు రూరల్/వెంకటాపూర్, మే 19: అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తోంది. 15 రోజులుగా పడిగాపులు గాసినా తేమ పేరుతో వడ్లు కొనకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వడ్లకు మొలకలు వచ్చాయి. దీంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. వరుస వర్షాలతో ఏటూరునాగారం, ములుగు, వెంకటాపూర్ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. వడ్లపై కప్పిన టార్పాలిన్పై నీటిని ఎత్తిపోయడం, మళ్లీ కప్పుకోవడం రైతుకు దినచర్యగా మారింది.

లారీల కొద్దీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోయింది. కనీసం వడ్లు నింపుకునేందుకు గన్నీ సంచులూ ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తడిసిన వడ్లను కొనుగోలు చేయడంతో పాటు పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వర్షాలతో పలు చోట్ల చేతికందే దశలో ఉన్న వరి పంట నేలమట్టమైంది.
పాలకుర్తి: తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. పాలకుర్తి మండలం విస్నూరు, తొర్రూరులోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఐకేపీ కేంద్రాలకు మూడు నెలల నుంచి ధాన్యం వస్తున్నా కొనుగోలు చేయకుండా సర్కారు నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, విస్నూరు ఎంపీటీసీ మాటూరి యాకయ్య, నాయకులు రాపాక రంగయ్య, సోమన్న, మాజీ సర్పంచ్ నకీర్త యాకయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎండీ అఫ్రోజ్, కార్యదర్శి బెజాడి సురేశ్, సోమేశ్వర్రావు, భద్రయ్య ,బాలగాని నాగరాజు, అడ్డూరి భూపాల్రావు, అనిల్, చలపతిరావు పాల్గొన్నారు.