హనుమకొండ చౌరస్తా, నవంబర్ 28: వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 23వ స్నాతకోత్సవాన్ని సంబురంగా నిర్వహించారు. అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకల్లో మైక్రాన్ ఇండియా, మైక్రాన్ టెక్నాలజీ ఆపరేషన్స్ ఇండియా ఎల్ఎల్పీ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్రామమూర్తి, గౌరవ అతిథిగా రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి, డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి.కమాత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్రామ్మూర్తి పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు.
విజయం సులువుగా రాదని అనిశ్చితి పరిస్థితుల్లో సైతం ముందుకు సాగడం నేర్చుకోవాలని సూచించారు. దయ, వినయం, న్యాయం వంటి విలువలే నిజమైన మేధస్సని తెలిపారు. మైక్రాన్ 3ఎఫ్ ప్రిన్సిపాల్-ఫేర్, ఫీయర్లెస్, ఫన్ గురించి చెప్పి, ఆసక్తిని పెంపొందించుకోవడం, మౌన నెట్వర్కింగ్, పోలికలను నివారించడం, ఏఐని ఆవిష్కరణకు వేదికగా చూడాలని సూచించారు. చురుకుగా ఉండండి, దయతో ఉండండి, అనుభవం స్పష్టత ఇస్తుందన్నారు.
నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి వారసత్వం, బలమైన విద్యాపర్యావరణం, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వరంగల్ నిట్ ప్రతిష్ఠను వివరించారు. 2025-26 సంవత్సరానికి రికార్డుస్థాయి ప్లేస్మెంట్లు, మొత్తం రూ.45.65 కోట్లు విలువైన 118 రీసెర్చ్ ప్రాజెక్టులు, 51 కొత్త పేటెంట్లు, సీఐఐఈ ద్వారా పెరుగుతన్న స్టార్టప్ సంస్కృతిపై వివరించారు. కొత్త హాస్టళ్లు, పునరుద్దరించిన అకాడమిక్ బ్లాకులు, మెరుగైన విద్యార్థి సౌకర్యాలు, సస్టెనబిలిటీ ప్రాజెక్టుల అభివృద్ధి, అలుమ్ని సహకారాలు వంటి ముఖ్యమైన మౌళిక సదుపాయాల పురోగతిని ప్రస్తావించారు. మొదటిసారి సంస్థ ప్రతిష్టాత్మక గౌరవ డిగ్రీలు ప్రదానం చేశారు.