గోవిందరావుపేట/ తాడ్వాయి/ ములుగు రూరల్, అక్టోబర్ 20 : నియోకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె గోవిందరావుపేట, తాడ్వాయి మండలకేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సమావేశం, ములుగు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వేర్వేగా జరిగిన ఈ కార్యక్రమాల్లో నాగజ్యోతి మాట్లాడారు. ప్రతి కార్యకర్తను తోబుట్టువుగా చూసుకోవడమే తన ఆకాంక్ష అని, మారుమూల గ్రామంలో పుట్టిన తనను గుర్తించి సర్పంచ్ స్థాయి నుంచి జడ్పీ చైర్పర్సన్ స్థాయికి పంపారని, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అడగకుండానే ములుగును జిల్లా చేయడం, మల్లంపల్లిని మండలంగా, ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు ములుగులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేయాలని చూ స్తున్నదని, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ను మూడోసారి గెలిపంచుకొని రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ప్రజలను కోరారు.
గతంలో ములుగు ప్రజలు ప్రతి ఒక్కరిని తమ భుజస్కందాలపై మోసి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారని తనను కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తే సీఎం కేసీఆర్ అండదండలతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నాగజ్యోతి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను ఆమోమయానికి గురి చేస్తున్నారని, కార్యకర్తలు సమష్టిగా గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. గత ఎమ్మెల్యే గెలిచి స్వలాభం కోసం కాంట్రాక్ట్‌లు చేస్తూ కోట్లాది రూపాయలు దండుకున్నారని, నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని ఆరోపించారు. మండల ఇన్చార్జి సాంబారి సమ్మారావు మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ఉన్న నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగు పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా నాగజ్యోతి, సమ్మారావులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో ములుగు గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సూరపనేని సాయికుమార్, ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, నాయకులు సురేందర్, దేవానాయక్, తాడ్వాయి మండల అధ్యక్షుడు మల్లయ్య, ఎంపీపీ వాణిశ్రీ, ఏటూర్‌నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు సాంబయ్య, జీసీసీ డైరెక్టర్ పురుషోత్తం, నాయకులు యాదిరెడ్డి, ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, శివయ్య, సమ్మిరెడ్డి, నర్సయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
30 ఏళ్లుగా వివాదాస్పందంగా ఉన్న సుమారు 2వేల ఎకరాలకు అర్హులైన వారందరికీ పట్టాలిపించే బాధ్యత తనదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యే పట్టాలిప్పిస్తామని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. శుక్రవారం భూపాల్‌నగర్(పంది కుంట) రామచంద్రాపూర్, శివ తండా, మదునూరి తండా, గుత్తూరు తండా, కోడిశలకుంట, నిమ్మ నగర్ గ్రామాల్లో రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్ రెడ్డితో కలిసి నాగజ్యోతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాదాస్పద భూములకు పట్టాలిప్పించడంతో పాటు గ్రామాలు, తండాలకు దేవాదుల పైప్‌లైన్ ద్వారా నీటిని మళ్లించి చెరువులు నింపుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల మ్యానిఫెస్టో రైతులు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉందన్నారు. అర్హులైన పేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇచ్చిన తర్వాతే తాను ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆశయ సాధన మేరకు మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే సీతక ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేవలం సంపాదన కోసమే పని చేసిందన్నారు. మొదటి విడుత దళిత బంధులో అర్హుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. అయితే వారికి దళిత బంధు రాక బాధితులు నిలదీయడంతో ఇటీవల మరణించిన జిల్లా కాంగ్రెస్ నాయకుడికి డబ్బులు ఇచ్చామని తప్పించుకుంటున్నారన్నారు. సర్పంచ్ తుమ్మ జైపాల్, ఎంపీటీసీ లాలు, భానుచందర్, రూప్ సింగ్, భూక్యా దేవ్‌సింగ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.