నర్సింహులపేట, మే 31 : సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతలు యూనిఫామ్స్ అందజేస్తారు. ఇందుకు సంబంధించి ఏటా మే మొదటి వారంలోనే సంబంధిత ఏజెన్సీ ద్వారా మండల పాయింట్‌కు, అక్కడి నుంచి ఐకేపీ ఎస్‌హెచ్‌జీలకు క్లాత్‌ను చేరవేస్తారు. ఆ గ్రూప్‌లు పాఠశాలల పునః ప్రారంభం నాటికే యూనిఫామ్స్‌ను సిద్ధం చేసి ప్రధానోధ్యాయులకు అందజేస్తే వారు విద్యార్థులకు పంపిణీ చేస్తారు.
మరో 11 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం కానున్నప్పటికీ విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించడం అనుమానంగానే ఉంది. మహబూబాబాద్ జిల్లాలో యూనిఫామ్స్ కుట్టి పంపిణీ చేసేందుకు ఇప్పటి వరకు క్లాత్ రాలేదు. దీంతో ఎప్పుడు క్లాత్ వస్తుందో.. యూనిఫామ్స్ కుట్టేదెప్పుడో.. విద్యార్థులకు అందించేదెప్పుడో అనే దానిపై సందిగ్ధత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 762 పాఠశాలల్లో సుమారు 40,703 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికే యూనిపామ్స్ ఇచ్చేందుకు గత ఫిబ్రవరి, మార్చిలోనే ఐకేపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) వారిచే కొలతలు సేకరించారు.
అయితే జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నప్పటికీ ఇంతవరకు సంబంధిత ఏజెన్సీల నుంచి మండల పాయింట్‌కు క్లాత్ చేరలేదు. దీంతో యూనిఫామ్స్ పంపిణీపై సందిగ్ధత చోటుచేసుకుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2నే విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యప్తుకాలు అందజేసేవారు. అయితే ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే యూనిఫామ్ క్లాత్ ఇంతవరకు రాలేదని, ఇప్పటికైనా తెప్పించి దుస్తులను సిద్ధం చేసి అందజేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.