కాలిఫోర్నియా: శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు(ఏఐ) ఉపయోగించి కొత్త వైరస్‌లను రూపొందించారు. వాటిలో 16 వైరస్లు బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేయగల క్రీయాశీలక క్రిములుగా మారాయి. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఆర్క్ ఇన్స్టిట్యూట్కు చెందిన బృందం సైన్స్ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. ఈ వైరస్లు కేవలం బ్యాక్టీరియాపై మాత్రమే దాడి చేస్తాయి. ఇవి మనుషులకు, జంతువులకు లేదా మొక్కలకు సంక్రమించలేవు.
సూపర్ బగ్స్కు వ్యతిరేకంగా కొత్త ఆయుధాన్ని ఏఐ అందించగలదని ఈ అధ్యయనంతో స్పష్టమవుతున్నది. అదేసమయంలో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే డీఎన్ఏ డాటాపై శిక్షణ పొందిన సాఫ్ట్వేర్ ఇప్పుడు మొదటి నుంచి పనిచేసే ఒక వైరస్‌ను సృష్టించగలదని నిరూపితమైంది. జాన్స్ హాప్కిన్స్కు చెందిన ఇద్దరు పరిశోధకులు థామస్ ఇంగిల్స్బై, మోరిట్జ్ హాంకే దీనిపై స్పందిస్తూ.. ఏఐతో వైరల్ జన్యువులను తయారు చేసే సామర్థ్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని, కానీ దానిని నియంత్రించే నియమాలు మాత్రం లేవని స్పష్టం చేశారు.
ఈవో 1, ఈవో 2 అని పిలిచే ఈ మోడళ్లు చాట్‌జీపీటీ తరహాలోనే పనిచేస్తాయి. చాట్‌జీపీటీ తర్వాత పదం ఏమిటో అంచనా వేస్తుంది. ఈవో అనేది డీఎన్ఏ వరుసలో తర్వాత ఏ రసాయన అక్షరం వస్తుందో అంచనా వేస్తుంది. దానికి సరిపడా జన్యు కోడ్‌ను అందిస్తే, చాట్‌బాట్ ఇంగ్లిష్ భాషను అర్థం చేసుకున్నట్టే ఇది కూడా జీవ నిర్మాణాత్మక వ్యాకరణాన్ని పట్టుకోవడం ప్రారంభిస్తుంది. స్టాన్‌ఫోర్డ్‌కు చెందిన బ్రియాన్ హై నేతృత్వంలోని బృందం దీనికి మిలియన్ల కొద్దీ సహజ జన్యువులపై శిక్షణ ఇచ్చింది. తర్వాత బాగా అధ్యయనం చేసి ‘ఎక్స్174’ దాని అనుబంధ వైరస్‌లపై దృష్టి పెట్టింది. ఈవో వందల, వేల సాధ్యమయ్యే కొత్త డిజైన్లను రూపొందించింది.
పరిశోధకులు వాటిలో దాదాపు 300 డిజైన్లను ఎంచుకుని, ఆ డీఎన్ఏను ల్యాబ్‌లో భౌతికంగా తయారు చేసి బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టారు. ఏఐ రూపొందించిన వైరస్లు సజీవంగా ఉన్నాయని గ్రాడ్యుయేట్ విద్యార్థి శామ్యూల్ కింగ్ గుర్తించారు. పెట్రీ డిష్‌పై పెరిగే బ్యాక్టీరియా మసకగా ఉండే పొరలా ఏర్పడుతుంది. ఏదైనా వైరస్ ఆ బ్యాక్టీరియాను తిని నాశనం చేస్తున్నప్పుడు అక్కడ స్పష్టమైన ఖాళీ చుక్కలు కనిపిస్తాయి. శామ్యూల్ కింగ్‌కు ఒకరోజు ఉదయాన్నే పెట్రీ డిష్‌పై అలాంటి చుక్కలు కనిపించాయి. మనుగడ సాగించిన 16 వైరస్లు బలహీనమైనవి కావు.
వాటికి నమూనాగా తీసుకున్న సహజ వైరస్ కంటే కొన్ని వేగంగా వృద్ధి చెందాయి. సహజ వైరస్‌ను తట్టుకునే శక్తిని ఇప్పటికే పెంచుకున్న ఈ.కోలి బ్యాక్టీరియాను కూడా ఏఐ రూపొందించిన ఈ వైరస్ల మిశ్రమం పూర్తిగా నాశనం చేసింది. ప్రకృతి నుంచి సేకరించిన వైరస్ల మిశ్రమం ఆ పని చేయలేకపోయింది. ఏఐ అదుపు తప్పకుండా ఉండడానికి పరిశోధకులు ఎలాంటి ప్రమాదకరమైన డాటాను శిక్షణ కోసం ఉపయోగించలేదు. మనుషులు, జంతువులు, మొక్కలు లేదా శిలింధ్రాలకు సోకే వైరస్‌లను మోడల్ డాటాలో చేర్చలేదు. ఈ జాగ్రత్తలను హాంకే మెచ్చుకున్నారు. అయితే ఈ బృందం అనుసరించడానికి ఎటువంటి అధికారిక నియమావళి లేదని ఆయన గుర్తుచేశారు.
కొత్త యూఎస్ ఆరోగ్య విధానం జీవ కారకాలను మరింత ప్రమాదకరంగా మార్చడాన్ని నిషేధించింది. అయితే ఇది కంప్యూటర్‌పై చేసే పనులకు వర్తించదు. అంతేకాకుండా ఈవో 2 అనేది ఒక ఓపెన్ సోర్స్. ఇది ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలామందిని ఆందోళనకు గుర్తిచేస్తున్నది. అయితే భయపడాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన టామ్ ఎల్లిస్ మాట్లాడుతూ.. ఇది ఎవరైనా ప్రయత్నించగల అత్యంత చిన్న, సులువైన జన్యువు అని పేర్కొన్నారు. ‘ఈ వైరస్‌కు దాదాపు 5,400 అక్షరాల కోడ్ అవసరం. కానీ ఒక సాధారణ సజీవ కణానికి 5,00,000 అక్షరాలు కావాలి. దీనికంటే పెద్దవాటిని తయారుచేయడం చాలా కష్టమైన పని, కానీ అసాధ్యం అయితే కాదు ’ అని టామ్ ఎల్లిస్ వ్యాఖ్యానించారు.