దస్తురాబాద్, ఆగస్టు 7 ; ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మాట్టానికి చేరి నిండు కుండ లా మారింది. ఆయకట్టు సాగుకు కాలువల ద్వారా నీటి విడుదల లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెం దుతున్నారు. గతేడాది వానకాలం సీజన్‌కు జూలైలోనే నీటి విడుదల చేయగా, ఈ సారి ఆగస్టు మొదటి వారమైనా నీటి విడుదలపై స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
నిర్మల్ జిల్లాల్లోని ప్రధానమైన కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద 68 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తురాబాద్ మండలాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని జన్నారం, లక్షెట్టిపేట్, హజీపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు కడెం ప్రాజెక్ట్ నీరు ఆధారంగా పంటలు సాగు చేస్తారు. భారీ వరదలతో కడెం ప్రాజెక్ట్ 700 అడుగుల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం మేరకు అధికారులు నీటిని నిల్వ కొనసాగిస్తున్నారు. ఆయకట్టు రైతులు నార్లు పోసుకోగా, ప్రస్తుతం నారు ఎదిగింది. నాట్లు వేసేందుకు భూములను సిద్ధం చేసుకున్నారు. నాటు వేసుకుందామంటే కడెం నుంచి నీటి విడుదల లేక ప్రాజెక్టు కుడి, ఎడమ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ సాగు నీటి విడుదలపై అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంతో సతమతమవుతున్నారు. మరికొందరు రైతులు నీళ్లు లేక రైతులు నాట్లు వేయలేక భూములను దున్నకుండా ఉంచారు. ఆలస్యం చేస్తే పంట దిగుబడులపైనా ప్రభావం పడే అవకాశం ఉందని, కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేసి రైతులకు ఊరట కల్పించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
నీటి విడుదలపై అధికారుల సందిగ్ధం
కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అస్థిరంగా మారడంతో కడెం ప్రాజెక్ట్ అధికారుల నిర్ణయం మరింత సందిగ్ధంగా మారింది. ప్రాజెక్ట్ 7.650 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.495 టీఎంసీల నీటి నిల్వ ఉంది.4.155 టీఎంసీల పూడిక ఉంది. పూర్తి స్థాయిలో ఆయకట్టు సాగుకు నీళ్లు ఇవ్వగలమా ? లేదా ? అనే సందేహం అధికారుల్లో వ్యక్తమవుతున్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక వేళ సాగుకు నీటిని విడుదల చేస్తే వచ్చే సెప్టెంబర్, అక్టోబర్‌లో వర్షాలు పడి మళ్లీ నీళ్లు వచ్చి ప్రాజెక్ట్ నిండుతుందా ? లేదా ? అనే సందిగ్ధంలో అధికారులున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు పడి వరదలు వచ్చి కడెం నిండితేనే పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో జూలైలోనే సాగునీటిని విడుదల చేసినప్పటికీ ఈ సారి వర్షాల తీరు నీటి లభ్యత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్ణయం కోసం, సాగు నీటి విడుదల కోసం ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు.
నీటి విడుదలపై స్పష్టత కరువు
ఇటీవల రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ద్దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్, అధికారులు కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆయకట్టుకు సాగు నీటి విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. నీటి విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
ఆగస్టు వచ్చినా నీటి విడుదల చేయలే..
ప్రస్తుతం నేను కడెం ప్రాజెక్ట్ ఆయకట్టు కింద 3 ఎకరాల్లో వరి సా గు కోసం పెట్టుబడి పెట్టిన. వరి నారు ఎదిగింది. నాటు వేద్దామంటే నీళ్లు లేవు. ప్రాజెక్ట్‌లో సాగు నీటి విడుదలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నందున, ఆల స్యం చేయకుండా నీటి విడుదల చేయాలి. నీటి విడుదలపై అధికారులు వెంటనే నిర్ణయం తీసుకొని ఆయకట్టు రైతులకు భరోసాను క ల్పించాలి. ఆగస్టు వచ్చినా విడుదల లేదు. అధికారులు వెంటనే నిర్ణయం తీసుకొని కాలువలకు నీటి విడుదల చేయాలి. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు.
-ఎంబడి సత్యం.కొత్తురు పల్లె.జన్నారం మండలం
కడెం ప్రాజెక్టు నీరే మాకు ఆధారం
కడెం ప్రాజెక్టే మాకు జీవన ఆధారం. కడెం ప్రాజెక్ట్ నుంచి సాగు నీటి ని అధికారులు విడుదల చేస్తేనే మా పంటలు పండుతాయి. నాకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుతానికి నారు ఎదిగింది. అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో పొలాలను ఉంచినం. నారు ముదిరితే నాటు వేయలేం. దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గతేడాది జూలైలోనే సాగు నీటిని విడుదల చేశారు. కాబట్టి రైతులు నష్ట పోకుండా అధికారులు సాగు నీటిని విడుదల చేసి, రైతులు నష్టపోకుండా చూడాలి.
-చెవులమద్ది చంద్ర శేఖర్, రైతు, దేవునిగూడెం, జన్నారం మండలం
నీటి విడుదలపై నిర్ణయం రాష్ట్ర కమిటీదే..
కడెం నారాయణ ప్రాజెక్ట్ ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండకుంది.కాగా ఆయకట్టు రైతులు సాగు నీరు ఇవ్వలా లేదా అనేది రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఆయకట్టు రైతులకు సాగు నీటిని విడుదల చేస్తాం.సాగు నీటిని విడుదల చేసే ముందు రైతులకు తెలియజేస్తాం.
-ప్రవీణ్ కుమార్,ఈఈ,కడెం ప్రాజెక్ట్