నిబద్ధత, ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగాలు సాధించడం సులువని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ఆధ్వర్యంలో మామునూరు పీటీసీలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. యువత ఆత్మవిశ్వాసం, సబ్జెక్టుపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ముందుండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు సేవ చేసేవారని పేర్కొన్నారు. వందలాది మంది అభ్యర్థులకు ఉచితంగా నాణ్యమైన కోచింగ్‌ను అందిస్తున్న అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ విశాల్‌ను అభినందించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 80 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీచేయనున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
కరీమాబాద్, మే 29 : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువత ప్రజా సేవ చేసేందుకు వస్తున్నామని గుర్తుంచుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ఆధ్వర్యంలో మామునూరులోని పీటీసీలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు సేవ చేసేవారన్నారు. అవినీతి రహితంగా విధులు నిర్వర్తించాలన్నారు. నిబద్ధత, ప్రణాళిక ప్రకారం చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించొచ్చన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవాలన్నారు. వందలాది మందికి ఉచితంగా కోచింగ్ అందిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్‌ను అభినందించారు. అనంతరం నిర్వాహకులు లక్ష్మీనారాయణను సత్కరించారు.

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో యువత కోసం అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇస్తున్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధించిన తెలంగాణలోని యువత కోసం 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామన్నారు. పేదవారు, వసతులు లేని వారు సైతం ఉద్యోగాలు సాధించాలనే ఈ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అండగా ఉన్నారన్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే యువతకు దిశానిర్దేశం చేసేందుకే వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న అధికారులను తీసుకువస్తున్నామన్నారు. కార్యక్రమంలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్, మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్ పాల్గొన్నారు.