జనగామ, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాలో దళారుల చేతిలో పత్తి రైతు చిత్తవుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించిన అన్నదాత అడుగడుగునా వంచనకు గురవుతున్నాడు. ఒకపక్క తేమ పేరుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు కొనుగోళ్లను నిరాకరిస్తుండగా, అదే పత్తిని జిన్నింగ్, కాటన్ మిల్లుల నిర్వాహకులు, మధ్య దళారులు తక్కువ ధరకు కొని తిరిగి రైతుల పేరిట సీసీఐకే అమ్ముతున్నారు. మరోపక్క గ్రామాల్లో రైతుల నుంచి తక్కువ ధరకు నేరుగా కొంటున్న దళారులు.. వారి పేరిటే సీసీఐలో మద్దతు ధరకు విక్రయిస్తున్నారు.
తమకు తెలిసిన రైతుల పట్టాపాస్ బుక్కులు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలను ఆన్లైన్లో అనుసంధానం చేయిస్తున్నారు. ఇదంతా మార్కెటింగ్‌శాఖ అధికారులు, మార్కెట్ సిబ్బందికి తెలిసే జరుగుతున్నది. రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనేందుకు సవాలక్ష సాకులు చూపుతున్న సీసీఐ అధికారులు మిల్లర్లు, దళారులు తెస్తున్న అదే పంటను కొనుగోలు చేస్తుండడాన్ని చూస్తే ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఛీటింగ్ చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది.
ఇప్పటి వరకు సీసీఐకి అమ్మిన పత్తి నిల్వల్లో సగానికంటే ఎక్కువ పంట పండించని రైతుల పేర్లతో ఆన్లైన్లో నమోదుకావడం గమనార్హం. పత్తి రైతులకు మంచి ధర అందించాలన్న ఉద్ధేశంతో జిల్లాలో 10 ప్రాంతాల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసింది. అయితే అధికారుల అండతో దళారులు కొత్త ఎత్తులతో రైతులను చిత్తు చేస్తూనే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం 8 శాతం తేమ ఉన్న ఎ-గ్రేడ్ పత్తి క్వింటాల్‌కు రూ.7,521, 9 నుంచి 12 శాతం వరకుంటే ఒక్కో శాతానికి రూ.75 తక్కువగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగా పత్తి ఆరబెట్టుకునే పరిస్థితి ఉండదు. మార్కెట్‌కు తీసుకొస్తే అమ్ముకొని ఇంటికి పోవాల్సిందే. ఒకసారి మార్కెట్‌కు తెచ్చిన పత్తిని తిరిగి తీసుకుపోవాలంటే రవాణా ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీంతో తేమ, పత్తి నల్లబారిందనే సాకుతో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ. 1,000 నుంచి రూ. 2 వేలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
దీనికి తోడు తూకంలోనూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలకు సంబంధించి రిమోట్‌ను జేబులో పెట్టుకొని రైతులకు తెలియకుండా ఒక్కో బస్తాకు 5 నుంచి 10 కిలోలు తక్కువ చూపిస్తున్నారు. అలాగే పత్తి నాణ్యంగా ఉన్నప్పటికీ యంత్రాల మాయాజాలంతో తేమను ఎక్కువ చూపిస్తున్నారు. అటు తేమ, ఇటు ధరలతో పాటు తూకంలోనూ మోసం చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు.
లింగాలఘనపురం మండలం నెల్లుట్లలోని సత్యసాయి కాటన్ ఇండస్ట్రీస్‌లో రూ.6 వేల నుంచి రూ.6,200కు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పైగా 2శాతం కమీషన్, అన్లోడింగ్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పత్తి మిల్లుల నిర్వాహకులు, ప్రైవేట్ వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి దోపిడీ చేస్తున్నారు. జనగామ మార్కెట్ పరిధిలో ఐదు, స్టేషన్‌ఘన్‌పూర్ మార్కెట్ పరిధిలో రెండు, కొడకండ్ల మార్కెట్ పరిధిలో ఏర్పాటు చేసిన మూడు కొనుగోలు కేంద్రాల్లో అసలు రైతుల సరుకు నామమాత్రంగా కొని, బినామీ రైతుల పేర్లతో దళారులు తెచ్చిన పత్తిని కొంటున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ మినహా సీసీఐ కొనుగోలు కేంద్రాలను జిల్లాలోని ప్రైవేట్ కాటన్, జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేశారు. ప్రైవేట్ మిల్లుల్లోనే ఒకవైపు సీసీఐ, మరోవైపు ప్రైవేటు కొనుగోళ్లు జరుగుతుండగా, తేమ సాకుతో సీసీఐ పతి కొనుగోలుకు నిరాకరిస్తున్నది. దీంతో రవాణా ఖర్చు భారంగా భావిస్తున్న రైతులు వేరేచోటకు తరలించలేక అనివార్యంగా పక్కనే ఉన్న ప్రైవేట్ వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకుంటుంటుండగా, అదే పత్తిని రైతుల పేరిట సీసీఐకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కేంద్రాల్లోని సీసీఐ పర్చేజింగ్ అధికారులతో దళారులు, మిల్లర్లు, వ్యాపారులు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటూ రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో 10 ప్రాంతాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ఐదారు కేంద్రాల్లోనే పూర్తిస్థాయిలో క్రయ విక్రయాలు జరుగుతుండగా, మిగిలిన కేంద్రాల్లో క్వింటాల్ పత్తి కూడా కొనుగోలు చేయలేదు. కాగా, జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 20 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.