రాయపోల్, మార్చి 3: మొన్నటి వరకు బాగా పలికిన టమాట ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. దీంతో పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. గిట్టుబాటు ధర లేక టమాట పంట తెంపకుండా రైతులు చేనులో వదిలేస్తున్నారు. నీటి వసతి తక్కు వ ఉండడంతో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రైతులు అధికశాతం కూరగాయ పంటలసాగుపై దృష్టి పెట్టారు. వంద ఎకరాల్లో టమాట పంటసాగు చేశారు. ఒక్కసారిగా టమాట ధర పడిపోవడంతో పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. కనీసం కూలీలకు,పంట తరలించే రవాణా చార్జీలు కూడా రాక టమాట పంటను చేనులోనే వదిలేస్తున్నారు. 20 రోజుల క్రితం మార్కెట్లో కిలో టమాట రూ.30 పలకగా రైతులకు రూ.20 వచ్చేది కానీ, ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.5 నుంచి రూ.10 మధ్య ధర పలకడంతో హోల్సెల్లో కిలో రూ.2 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.20వేల పెట్టుబడిపెట్టి నష్టపోయా
ఎకరంలో టమాట పంట సాగు చేశా. చేతికందిన సమయంలో మార్కెట్లో ధర లేదు. పంట సాగు కోసం రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టా. మార్కెట్లో అధిక ధర వస్తుందని ఆశించా. టమాట నారు తీసుకువచ్చి ఎకరంలో నాటా. ఎరువులు,దున్నడం,కూలీలకు ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. తీరాపంట తెంపుతున్న సమయంలో టమాటకు ధర లేదు. టమాట పంటసాగుచేస్తే కన్నీళ్లు మిగిలాయి.
-కరుణాకర్, యువ రైతు, రాంసాగర్, రాయపోల్ మండలం (సిద్దిపేట జిల్లా)
అధిక ధర ఉంటుందని పంట సాగుచేశా
మార్కెట్లో అధిక ధర ఉంటుందని పంటసాగు చేశా. టమాటకు సరైన ధర రాలేదు. ఎంతో ఆశతో పంట సాగు చేస్తే కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదు. ఓ దశలో టమాట తెంపి ధర లేక రోడ్డుపై పారబోశా. పెట్టుబడులు పెట్టి సాగుచేస్తే అందుకు అనుగుణంగా ధర లేదు. దీంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికైనా ధర పెరుగుందనే ఆశతో ఉన్నాం. కనీసం పెట్టబడులు వస్తాయని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. టమాట పంట తెంపకుండా చేనులోనే వది లేస్తున్నాం.
– ఉడిది ప్రకాశ్, తిమ్మక్కపల్లి, రాయపోల్ మండలం (సిద్దిపేట జిల్లా)