టెహ్రాన్ : ఒక దేశ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు, అతను ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అతని వెంట ఎవరున్నారు? అన్న వివరాలు తెలుసుకోవడం అంత సులభం కాదు. అదీ కూడా యుద్ధ సమయంలో, ప్రాణాలకు ఆపాయం ఉందన్న హెచ్చరికలు ఉన్నప్పుడు మరింత కష్టం. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీని హతమార్చేందుకు ఈ లక్ష్యాన్ని చాలా సులభంగా నిర్వహించి వంద శాతం విజయం సాధించాయి అమెరికా-ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సీఐఏ, మొస్సాద్‌లు. వాటిని అంతే కచ్చితంగా అమలు చేశాయి వాటి వైమానిక దళాలు. అయితే ఖమేనీని హతమార్చడం అన్న ఆపరేషన్ వెనుక ఏండ్ల తరబడి నిఘా వర్గాలు చేసిన కృషి ఉంది. ఈ నిఘా నిన్నో మొన్నో ప్రారంభం కాలేదు. సంవత్సరాల నుంచి ఎంతో ఓపికగా కాచుకుని ఎట్టకేలకు 86 ఏండ్ల ఖమేనీపై దాడి చేసి చంపేశారు. ఖమేనీ హత్యకు సంబంధించి ఇప్పటికే పలు సిద్ధాంతాలు ప్రచారంతో ఉన్నాయి.
అందులో డెంటల్ చిప్ విధానం ఒకటి. ఇందులో దంత ట్రాకింగ్ పరికరాలు అమర్చడం నుంచి ఖమేనీ సన్నిహితులకు సంబంధించిన పుట్టు మచ్చలు సేకరించినట్టు సమాచారం. ట్రాఫిక్ కెమెరాలు, యాప్‌లు, చానళ్లు హ్యాకింగ్ చేయడం మరో విధానం. ముందుగా దంతాలను ఎలా ట్రాక్ చేసారో పరిశీలిస్తే.. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ తమ డాక్టర్లు, దంత వైద్యులను ఎప్పటి నుంచో ఇరాన్లో మోహరించింది. ముఖ్యంగా మిలిటరీ వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వీరు తమ క్లినిక్‌లను తెరిచే వారు. వారు తమ దగ్గరకు వచ్చే ఇరాన్ మిలిటరీ అధికారులకు దంత చికిత్స సమయంలో ఇంప్లాంట్లలో రహస్యంగా చిప్‌లు కూడా పెట్టి అమర్చేవారు. అలాగే పలు చోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తూ దంతాల్లో రంధ్రాలు, ఖాళీల పూడ్చివేత పేరుతో ట్రాకింగ్ పరికరాలను అమర్చేవారు. అదే విధంగా గ్యాస్ట్రో డాక్టర్ల ద్వారా అధికారులు, ముఖ్య నేతల ఆపరేషన్ల సమయంలో కడుపులో ఇలాంటి పరికరాలే అమర్చే వారు. దీని కారణంగానే ఖమేనీ, అతని కుటుంబం ఆచూకీని వీరు కచ్చితంగా కనుగొన్నారు. అయితే ఈ వాదనను ఎవరూ అధికారికంగా నిర్ధారించ లేదు. అలాగే కోటి మందికి పైగా వినియోగించే ఇరాన్ ప్రార్థన సమయ బడేసాబ్ యాప్‌ను కూడా ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హ్యాక్ చేశాయి. అలాగే పలు వెబ్సైట్లను, యాప్‌లను హ్యాక్ చేశాయి.
ఇరాన్లో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు ఎన్నో ఏండ్ల క్రితమే ట్రాఫిక్ కెమెరాలను అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు హ్యాక్ చేశాయన్న ప్రచారం జరుగుతున్నది. దాని ప్రకారం.. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్‌లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఈ నిఘా వ్యవస్థల ఆధీనంలోకి వచ్చేశాయి. దీంతో ఖమేనీ ఏ క్షణంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతసేపు ఉంటారు లాంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వారు. ముఖ్యంగా ఖమేనీ కదలికలు ఎక్కువగా ఉండే పాశ్చర్ వీధిపై వీరు నిరంతరం నిఘా ఉంచేవారు. నిజ కాల సమయంలో ట్రాఫిక్ డాటాను ట్రాకింగ్ చేయడం వల్ల శనివారం ఉదయం ఖమేనీ తన కార్యాలయానికి ఏ సమయంలో వస్తారు, ఆయనతో పాటు ఎవరు ఉంటారు అన్న విషయాన్ని మొస్సాద్, సీఐఏ వర్గాలు ముందే పసిగట్టేశాయని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ఖమేనీ బాడీగార్డులు తమ వ్యక్తిగత వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తున్నారు? వారు ఎక్కడ భోజనం చేస్తున్నారు లాంటి వివరాలు కూడా నిఘా సిబ్బంది లైవ్‌లో తెలుసుకునే వారని తెలిపింది. పాశ్చర్ వీధి సమీపంలో దాదాపు డజన్ మొబైల్ ఫోన్ టవర్లలోని ఒకే ఒక టవర్ భాగాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేయగలిగిందని, కాల్ చేసినప్పుడు ఫోన్లు బిజీగా అనిపించేలా చేసి ఖమేనీ రక్షణ విభాగాలు హెచ్చరికలు అందుకోకుండా చేసిందని ఒక నివేదిక వెల్లడించింది.