శాయంపేట, నవంబర్ 23 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇటీవల భగీరథ అధికారులు పైప్‌లైన్ పనులు పూర్తి చేసి చేపట్టిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. 40 కిలోమీటర్ల దూరంలోని పార్కుకు నీరు చేరడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఎం మిత్ర పథకంలో భాగంగా గత కేసీఆర్ సర్కారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట, సంగెం మండలం బొడ్డుచింతలపల్లి గ్రామాల పరిధిలో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పా టు చేసింది.
ఈ పార్కుకు అవసరమైన నీటిని చలివాగు నుం చి తరలించేందుకు రూ.100 కోట్లతో 2022 సెప్టెంబర్‌లో పనులు చేపట్టింది. శాయంపేట, గూడెప్పాడ్, ఊరుగొండ, అక్కంపేట, కోనాయమాకుల నుంచి మెగా టెక్స్టైల్ పార్కు వరకు 40 కిలోమీటర్ల మేర భూగర్భ పైపులైన్ పనులను మిష న్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు పూర్తిచేశారు. ప్రతిరోజూ చలివాగు రిజర్వాయర్ నుంచి 1.20కోట్ల లీటర్ల (12ఎంఎల్ డీ) నీటిని టెక్స్టైల్ పార్కుకు తరలించనున్నారు.
ఇందుకోసం చలివాగులో నూతనంగా ఇన్‌టేక్ వెల్ నిర్మించి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మూ డు 240 హెచ్‌పీ మోటర్లలో రెండింటి ద్వారా టెక్స్టైల్ పార్కు కు నీటి సరఫరా జరగనుంది. టెక్స్టైల్ పార్కుకు అవసరమైన శుద్ధ జలాలు అందించే 12 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) నిర్మాణం మరో నెలన్నర రోజుల్లో పూర్తికానున్నది. అలాగే 2,500 కేఎల్ సంప్ పూర్తయ్యిందని, దాని పక్కనే పంప్ హౌస్ నిర్మిస్తున్నామని, పనులు పూర్తి కావడం తో పాటు పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే నిరంతరం నీటిని పంపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీఈ శ్రీనివాస్ తెలిపారు. పైప్‌లైన్ పనులను వేగంగా పూర్తిచేసిన భగీరథ ఇంజినీరింగ్ అధికారులు ఇటీవల రెండు మోటర్లను ఆన్‌చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా ట్రయల్ రన్ నిర్వహించారు.