మెట్టలోని బీళ్లను తడిపేందుకు గోదారమ్మ పరుగులిడుతూ వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో సముద్రమట్టానికి 420 మీటర్ల ఎత్తులో నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయర్‌లో పరవళ్లు తొక్కింది. గురువారం పంప్‌హౌస్ ఒకటో మోటర్ స్విచ్‌ను ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ఆన్ చేయగానే తొలి ఏకాదశి, బక్రీద్ పర్వదినాల సాక్షిగా బిరబిరమంటూ తరలివచ్చిన తల్లి గోదావరికి స్థానిక రైతాంగం హారతిపట్టింది. సాధ్యం కాదనుకున్న గౌరవెల్లి రిజర్వాయర్ కళ్లెదుట సాక్షాత్కరిం చడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మెట్టను తడిపేలా జలగంగ ఉప్పొంగడంతో అక్కడున్న రైతులు, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధుల ఒళ్లు పులకరించింది.
– హనుమకొండ సబర్బన్, జూన్ 29
హనుమకొండ సబర్బన్, జూన్ 29 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని గౌరవెల్లి ప్రాజెక్టులోకి గోదావరి పరవళ్లు తొక్కొంది. అర్ధ శతాబ్దపు కల నెరవేరిన వేళ అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. పాత కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ ప్రాంతం అంటేనే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత కరువుకు చిరునామాగా ఉండేది. సాగు నీరే కాదు గుక్కెడు తాగు నీరు లభించక జనం విలవిల్లాడే వారు. ఈ ప్రాంతంలో ఎస్సారెస్పీ వరద కాలువ ప్రతి ఎన్నికల సందర్భంలో ఆయా పార్టీల నాయకులకు ఓట్లు దండుకునే నినాదంగా మారింది. దీని కోసం ఏనాడు తట్టెడు మట్టి తీసిన నాయకుడు లేడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గౌరవెళ్లి ప్రాజెక్టుకు 1.14 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీతో శంకుస్థాపన చేశారు. అయితే కనీసం భూసేకరణ కూ డా చేయలేదు. అలాంటి నిరాదరణ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ముం దుకు కదిలించారు. 8.23 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీకి పెంచారు. పూర్తి స్థాయి లో నిర్మించారు. తొలి ఏకాదశి, బక్రీద్ పర్వదినాల నాడు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఒక మోటర్‌ను నడిపించారు. మిగిలిన మూడు మోటర్లను కూడా రెండు రోజుల వ్యవధిలో ఆన్ చేస్తామని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే సతీమణి షమితతో పాటు, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్, సిద్దిపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, నీటి పారుదల శాఖ ఈఎన్సీ శంకర్, ఎస్ఈ సుమతీ దేవి, అధికారులు, ప్రజప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
లక్షా 6 వేల ఎకరాలకు సాగు నీరు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని గౌరవెళ్లి గ్రామ సమీపంలో నిర్మించిన ఈ సాగు నీటి ప్రాజెక్టు వల్ల లక్షా ఆరు వేల ఎకరాలకు ప్రత్యక్షంగా సాగు నీరు అందనుంది. ఆయా గ్రామాల్లోని చెరువుల్లో, కుంటల్లో నీరు నిల్వడం ద్వారా భూగర్భజలాలు భారీగా పెరిగి పరోక్షంగా కూడా వేలాది ఎకరాలకు నీటి వసతి అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టునుంచి తవ్విన టన్నెల్ ద్వారా పంప్‌హౌస్‌కు నీళ్లు చేరుకుంటాయి. అందులో నుంచి 96 మెగావాట్ల కేపాసిటీ గల మూడు పంపుల ద్వారా నేరుగా 57 క్యూమెక్స్‌ల నీళ్లు ప్రాజెక్టులోకి పంపింగ్ అవుతాయి. దీనికి రెండు కాలువలను ఏర్పాటు చేశారు. కుడి కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వార 90 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఈ ప్రాజెక్టు కోసం 3800 ఎకరాల భూమిని సేకరించారు.
హనుమకొండ, జనగామ జిల్లాలకు 58,656 ఎకరాల ఆయకట్టు
సిద్దిపేట జిల్లాలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, జనగామ జిల్లాలకు 56,656 ఎకరాలకు నేరుగా సాగు నీరు అందనుంది. అందులో హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో 10,508 ఎకరాలు, వేలేరు మండలంలో 11,714 ఎకరాలు, ధర్మసాగర్ మండలంలో 12,010 ఎకరాలు, కాజీపేట మండలంలో 600 ఎకరాలకు నీరు రానుంది. జనగామ జిల్లాలో చెల్పూర్ మండలంలో 11,816 ఎకరాలు, స్టేషన్ ఘన్పూర్ మండలంలో 7,223 ఎకరా లు, రఘునాథపల్లి మండలంలో 3,885 ఎకరాలు, జఫర్‌గఢ్ మండలంలో 900 ఎకరాలకు గౌరవెళ్లి ప్రాజెక్టు నీళ్లు అందనున్నాయి. ఇప్పటికే జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా, ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా, పుష్కలంగ సాగు నీరు అందుతుంది. మరికొద్ది 51 క్యూమెక్సుల డెలివరీ కెపాసిటీ గల టన్నె ల్ కూడా పూర్తవనుంది. దీంతో హనుమకొండ, జనగాం జిల్లాలు పూర్తిగా సాగునీటితో కళకళలాడనున్నాయి.
నా జన్మ ధన్యమైంది : ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్
లక్షా 6 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ మహాత్తర ప్రాజెక్టు మోటర్లను ఆన్ చేయడం ద్వారా తన జన్మ ధ న్యమైందని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ అన్నారు. ఇంతటి అ దృష్టాన్ని కలిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఇక్కడి ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును త్వరగా నిర్మించేందుకు అనేక విధాలా సహాయం చేశారన్నారు. తక్కువ సామర్థ్యమున్న ప్రాజెక్టును నిర్మిస్తే రైతులకు ప్రయోజనం ఉండదని ప్రాజెక్టు డిజైన్‌ను మార్పించి, 8.23 టీఎంసీలకు కెపాసిటీని పెంచారన్నారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన వారు ఈ ప్రాజెక్టును ఎన్నికల నినాదంగానే వాడుకున్నారన్నారు. తాను ఇచ్చిన హామీని పూర్తి చేశానని తెలిపారు. త్వరలో ప్రాజెక్టు సందర్శనకు సీఎం కేసీఆర్ వస్తారని వెల్లడించారు.