సుబేదారి, మే 1 : అనుమానం రాకుండా కార్లలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను వరంగల్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రూ.73 లక్షల విలువ చేసే 147.3 కిలోల గంజాయితో పాటు రెం డు కార్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం వరంగల్ ములుగురోడ్డులోని యాంటీ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సైదులు వివరాలు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లికి చెందిన నేరెళ్ల సదయ్య అలియాస్ సతీశ్, హనుమకొండ జిల్లా శా యంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన పామల శేషు ఆంధ్రప్రదేశ్‌లోని సుకుమామిడిలో గంజాయి కొనుగోలు చేసి ఇన్నోవా కారులో 40, స్విఫ్ట్‌లో 29 ప్యాకెట్ల చొప్పున నిజామాబాద్‌లో మున్వర్‌కు అందజేసేందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో పక్కా సమాచారంతో హనుమకొండ చింతగట్టు ఫ్లై ఓవర్ దిగుతుండగా వరంగల్ యాంటీ నార్కొటిక్స్ ఎస్సైలు శ్రీకాంత్, మొగిలి, సిబ్బం ది పట్టుకున్నారు. సదయ్య, శేషును అరెస్ట్ చేసి గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితులపై ఇప్పటికే కేయూసీ, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్ రవీందర్, ఇదర్దు ఎస్సైలు, సిబ్బంది రంగయ్య, సోమలింగం, విజయ్, రాజేశ్, శ్రీను, రహీమ్, సంపత్, రాజు, సతీశ్‌ను డీఎస్పీ అభినందించారు.