ఐనవోలు, నవంబర్ 18: కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నర్సింహులగూడెం, ముల్కలగూడెం, కొండపర్తి, వనమాలకనపర్తి, ఉడుతగూడెం, లింగమోరిగూడెం, రాంనగర్, ఒంటిమామిడిపల్లి గ్రామాల్లో శనివారం అరూరి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు డప్పుచప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశం, ప్రజల దీవెనలతో పదేళ్లపాటు కుటుంబ సభ్యుడిగా ఉండి కష్టసుఖాల్లో వెంటే ఉన్నానని అన్నారు. పండుగకు వచ్చినట్లు వస్తున్న పలు పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కత్తి ఆయనది కాదు.. నెత్తి ఆయనది కాదు.. మాటలు చెప్పెటోళ్లు ఎన్నయినా చెబుతారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలీస్ అధికారిగా పెద్ద హోదాలో పనిచేసి సార్ అనే పిలుపునకు అలవాటుపడ్డాడని, సామాన్యులను కూడా సార్ అని పిలవాలంటున్నాడని, తాను పదేండ్లు ప్రజల ఇంట్లో మనిషిలా ఉన్నానని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ మీ బిడ్డగా మీ మధ్యలోనే ఉన్నానని గుర్తుచేశారు. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తి కావాలా? సామాన్యులతో సార్ అని పిలిపించుకునే వ్యక్తి కావాలో మీరే ఆలోచన చేయాలని కోరారు.
అటు బూటకపు ఎన్కౌంటర్లతో అమాయపు ప్రజలను కాల్చి చంపిన రక్తపు మరకలు ఉన్నాయని, ఎన్కౌంటర్ స్పెషల్ అధికారిగా బూటకపు ఎన్కౌంటర్లతో ఎన్నో కుటుంబాలకు భర్త, కొడుకులు, అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లను కోల్పోయారని తెలిపారు. ఇప్పుడేమో ప్రజలకు సేవచేస్తానని వస్తున్నాడని, నాడు స్పెషల్ అధికారిగా చేసిన రక్తపు మరకలను వర్ధన్నపేట ప్రజలు ఇంకా మరువలేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నానని తెలిపారు. రక్తపు చేసిన అధికారి కావాలా? కడుపులో పెట్టుకునే చూసుకునే సేవకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా చివరికి వర్ధన్నపేటలో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ స్టీరింగ్ ఢిల్లీ చేతిలో పెడితే మళ్లీ గల్లీలో పోరాటాలు చేయకతప్పదన్నారు. బీజేపీ కేంద్రంలో ఉండి తెలంగాణ రాష్ర్టానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని, పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు తీసుకొని తెలంగాణ ప్రజలకు ఆశించిన స్థాయిలో పదేళ్లలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే కేసీఆర్, కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మోహన్, రైతుబంధు సమితి అధ్యక్షుడు సంపత్‌కుమార్, ఆలయా కమిటీ చైర్మన్ జయపాల్, సొసైటీ చైర్మన్లు చందర్రావు, బాబు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రవీందర్, నాయకులు గుంషావళి, సురేశ్, భాస్కర్, అరుణ్, సదానందం, అబ్బాస్‌అలీ, డీకే, ఏడీఆర్, రాజు, శంకర్ పాల్గొన్నారు.
ప్రచారంలో భాగంగా మొల్కలగూడెంకు వచ్చిన అరూరి, మార్నేనిలకు ఇటీవల తల్లి కోల్పోయిన చిన్నారి గువ్వుల ప్రిన్సితో కలిసి తండ్రి గువ్వుల ప్రశాంత్ వచ్చిన విషయం గమనించారు. వెంటనే స్పందించిన మార్నేని ఆ చిన్నారిని అరూరి అందించి, చిన్నారి పరిస్థితి వివరించారు. కాగా వెంటనే స్పందించిన ఆయన అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారికి, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.