కృష్ణకాలనీ, ఫిబ్రవరి 10 : అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందులో స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు ముందున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో భూపాలపల్లి, గణపురం మండలాల అధ్యక్షులు పిన్‌రెడ్డి రాజిరెడ్డి, మోతె కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ఎన్నికలకు వెళ్లేందుకు సర్కారు జంకుతున్నదన్నారు. గాలి మాటలతో గద్దెనెకిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తుంటే ఆగమేఘాల మీద నాలుగు పథకాలకు దరఖాస్తులు తీసుకొని ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు రైతుబంధు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచిన డబ్బులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చి కమీషన్లు తీసుకున్నాడని ఆరోపించారు.
ఇప్పడు మరోసారి రైతులను మోసం చేసేందుకు రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు వేసినట్లే వేసి ఎన్నికల కోడ్ పేరుతో ఆపేశాడన్నారు. రైతులు కాంగ్రెస్ మోసాన్ని గ్రహించి ఓటు అనే బ్రహ్మాస్త్రంతో ఆ పార్టీకి వాతపెట్టాలని సూచించారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్తే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. మరో ఐదారు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, కలిసికట్టుగా పనిచేసే పార్టీని గెలిపించాలన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంతో పాటు నాయకులు, కార్యకర్తల సూచన మేరకు టికెట్లు ఇస్తామని, శ్రేణులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని గండ్ర హామీ ఇచ్చారు. సమావేశంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కళ్లపు శోభా రఘుపతిరావు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్, నాయకులు మందల విద్యాసాగర్‌రెడ్డి, శ్రీనివాస్, రఘుపతి గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి, మండల అధ్యక్షురాలు మేకల రజిత, సులోచన, రెండు మండలాల్లోని మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.