జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి జిల్లా అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయని, రేవంత్‌రెడ్డి 30 నెలల పాలనపై తీవ్ర వ్యతిరేక త వ్యక్తమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 30 నెలల్లో జరిగిన అభివృద్ధి శూన్యమని, నేతలు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందినట్లు స్పష్టంగా కనిపిస్తున్నదన్నా రు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తా ను మంజూరు చేయించిన పనులు తప్ప కొత్త గా ఏమీ రాలేదన్నారు.
తాను మంజూరు చేయించిన పనులను సైతం పక్కన పెడుతున్నారని, పలు నిధులను ఎమ్మెల్యే తన స్వగ్రామానికి తరలించుకుపోతున్నారని విమర్శించా రు. మున్సిపల్ ఎన్నికల ముందు హడావుడి చేసి శిలాఫలకాలు వేశారని, ప్రస్తుతం ఆ పను లు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. రూ. 2 కోట్లతో పేదలకు ఉపయోగపడేలా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే కాంగ్రె స్ అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టారని, మరో రూ. 20 లక్షలు వెచ్చిస్తే అది వినియోగంలోకి వస్తుందన్నారు. కొత్తగా వారు వేసిన శిలాఫలకాలకు త్వరలోనే ప్రథమ, ద్వితీయ సంవత్సరీకాలు చేస్తామన్నారు. జిల్లా ఆస్పత్రిలో తాగడానికి, మరుగుదొడ్లకు నీరు లేని దౌర్భాగ్యం ఉంటుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల్లో పనులు జరగడం లేదని, కావాలనే వివక్ష చూపుతున్నారని, ఇది సరికాదన్నారు. కేటీఆర్‌ను ఒప్పించి బైపాస్ రోడ్డు మంజూరు చేస్తే కనీసం భూసేకరణ జరపడం లేదన్నారు.
‘బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చండి.. పేదల ఇండ్లు కూల్చివేయండి’ అంటూ రేవంత్‌రెడ్డి నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నాడని, గాంధీ పార్టీలో పుట్టానని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హిట్లర్ వారసుడు అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ర్టానికి సీఎం కావడం మన దౌర్భాగ్యమన్నారు.
కోట్లాది మందిని ఊచకోతకోసిన నరరూప రాక్షసుడిని తనకు రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నాడని, హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. బడేభాయ్.. ఛోటే భాయ్ అంటూ మోదీని భుజాల మీద ఎక్కించుకుంటున్న రేవంత్‌రెడ్డి బీజేపీలో ఎప్పుడు చేరతారో చెప్పాలని, ప్రధానితో మంచి సంబంధాలుంటే ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయించకుండా ఎందుకు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ప్రశ్నించారు. సింగరేణిలో కేసీఆర్ తీసుకొచ్చిన వారసత్వపు ఉద్యోగాలు పోగొట్టి, సైట్ విజిట్ పేరుతో బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
భూపాలపల్లిలో వెంకటేశ్వర ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ అధికారపార్టీ నేతలు, ఎమ్మెల్యే కావాలని కుట్రపూరితంగా వ్యవహరించడం కోర్టు ధిక్కరణేనని గండ్ర అన్నారు. అధికారులు ఎమ్మెల్యేకు దాసోహమయ్యారని, ఎస్పీ జోక్యం చేసుకోవాలన్నారు. రూ. 10 లక్షలు ఇచ్చి మధ్యప్రదేశ్ నుంచి వర్కర్లను తీసుకొస్తే పనులను అడ్డుకొని దౌర్జన్యం చేయడం ఏంటని మండిపడ్డారు.
సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ ప్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, నేతలు మాడ హరీశ్‌రెడ్డి, సెగ్గం సిద్ధు, తిరుపతమ్మ, పూలమ్మ, భాగ్యలక్ష్మి, వాసాల స్వప్న, కుమారస్వామి, మురళి, పూర్ణచందర్, నరేందర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.