మొగుళ్లపల్లి, ఏప్రిల్ 9 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు కదం తొక్కి కదలాలని, మహాసభను విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి, ఇప్పలపల్లి, పోతుగల్, కొరికిశాల, గణేశ్‌పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, పిడిసిల్ల గ్రా మాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందనే లక్ష్యంతో తన పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న మహాసభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సభకు వచ్చేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ తీరుపై ప్రజలు అసహనంగా ఉన్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని పథకాలనే కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్నదని, అనుభవం లేని, అసమర్థ, చేతగాని పాలనతో ప్రజలు అవస్థ పడుతున్నారన్నారు. రైతులకు నీళ్లివ్వకుండా చెక్‌డ్యాంలు ధ్వంసం చేసిన ఘనత ప్రస్తుత ఎమ్మెల్యేకు దక్కుతుందన్నారు. గ్రామాలకు వెళితే ప్రజలు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలనలోనే తాము బాగున్నామని, అభివృద్ధి కూడా జరిగిందని గుర్తుచేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ఏ ఎన్నిక వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థులేనన్నారు.
రజతోత్సవ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని రమణారెడ్డి అన్నారు. కాగా, ఆయా సన్నాహక సమావేశాలకు 200 బైక్‌లతో రమణారెడ్డి ర్యాలీగా వెళ్లారు. పోతుగల్లు గ్రామస్తులు చెరువు సమస్యను దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత ఏఈకి ఫోన్ చేసి మరమ్మతులు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన అకినెపల్లి మాజీ సర్పంచ్ దూడపాక భద్రయ్య, సీనియర్ నాయకుడు దూడపాక సమ్మయ్య గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ జడ్పీటీసీ జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేశ్, నాయకులు బెల్లంకొండ శ్యాం సుందర్‌రెడ్డి, పిన్నింటి వెంకట్రావు, నైనకంటి ప్రభాకర్‌రెడ్డి, దానవేని రాములు, రవీందర్రావు, లవయ్య, శ్రీధర్, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.