హనుమకొండ, జూలై 12 : కాంగ్రెస్ మెడలు వంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయించాలని, అందుకు ఓరుగల్లు నుంచే పోరాటానికి సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ. 11,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ హరిత హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించా రు. విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సా మాజిక సమస్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ముఖ్య అతిథిగా హాజరైన గండ్ర మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారన్నారు. తెలంగాణ వ్యతిరేకి, ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రి కావ డం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. స్వయంగా సీఎం హోదాలో ఓ మీటింగ్‌లో పాల్గొన్న రేవంత్.. మా ఉపముఖ్యమంత్రి ఉన్నాడు.. ఆయనతో సెటిల్మెంట్ చేసుకోండని అన్నాడంటే కమీషన్ల కోసమే కదా అని అన్నారు.
రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన సీఎం తాను హిట్లర్ వారసుడినని అభివర్ణించుకోవడం సిగ్గుచేటన్నారు. విద్యా వ్యవస్థను కాపాడుకోవాలంటే రాజకీయాలకతీతంగా అన్ని సంఘా లు ఒకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు విద్యార్థి సం ఘాలు వినతిపత్రాలు అందించి బకాయిల విడుదల కోసం ఒత్తిడి తీసుకురావాలని, స్పందించకపోతే వారి ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహిస్తామని గండ్ర హెచ్చరించారు. సమావేశంలో హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ సుధీర్‌కుమార్, జన్ను జకారియా, మంద కుమార్, కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుణహరి శేషు, సీపీఐ జిల్లా నేత రాజమౌళి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చుకయ్య, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య కేవలం విద్యార్థులు.. కళాశాలలదే కాదు.. పేద, మధ్యతరగతి విద్యార్థుల సామాజిక సమస్య. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అందుకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవని చెప్పడం దుర్మార్గం అందాల పోటీలు, మనుమడి కోసం పుట్‌బాల్ మ్యాచ్, పేపర్ యాడ్స్, సభలు, ప్రత్యేక హెలికాప్టర్, ఢిల్లీకి కప్పం కట్టేందుకు నిధులు ఉంటాయి. కానీ రీయింబర్స్‌మెంట్‌కు ఉండవా? ప్రభుత్వం కోరిన మేరకు ఆగస్టు 15 వరకు గడువు ఇస్తున్నాం. అప్పటికీ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.
– ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు