రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల మెరుగైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ రైతు కుటుంబాల్లో వెలుగులు నింపింది. కేసీఆర్ సీఎం అయ్యాక విద్యుత్ సరఫరాలో మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 2018కి ముందున్న విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించారు. విద్యుత్ ఆరు గంటలు కూడా సరిగా రాకపోగా, పలుమార్లు అంతరాయం ఏర్పడేది. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులను పూర్తిగా మార్చేశారు. లో వోల్టేజీ ఉన్నచోట, అవసరమైన ప్రతిచోట అదనపు ట్రాన్స్ఫార్మర్లు, కొత్త విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లుగా నిరంతరాయంగా మెరుగైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 65,340 వ్యవసాయ మోటర్ కనెక్షన్లు ఉండగా, రైతులు పంటలు సమృద్ధిగా పండిస్తున్నారు.
– వర్ధన్నపేట, జనవరి 3
వర్ధన్నపేట, జనవరి 3: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటలు ఉచిత మెరుగైన విద్యుత్‌ను 2018 నుంచి నిరంతరాయంగా సరఫరా కరెంటు కష్టాలతో గతంలో రైతులు నిరంతర కరెంట్‌తో సంబురంగా పంటలు చేసు కుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయగా అధికారులు నిర్మాణ పనులు పూర్తి చేశారు. వ్యవసాయ మోటర్లకు విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు డీడీలు చెల్లించగానే పరిశీలించి కొత్త లైన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు.
గతంతో ఒక్క విద్యుత్ పోల్ కావాలంటే రైతులే రూ.50వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రైతులు వ్యవసాయ బావులకు డీడీలు చెల్లిస్తే చాలు రూపాయి కూడా ఖర్చు లేకుండా విద్యుత్‌శాఖ కొత్తలైన్లు వేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది. గతంతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులు రోజుల తరబడి మరమ్మతు కేంద్రం వద్ద పడిగాపులు కాసేవారు. దీంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ఇప్పుడు గంటల వ్యవధిలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేసి తిరిగి ఏర్పాటు చేస్తున్నారు.
2018కి ముందు..
కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో.. తెలియదు. ఒక వేళ వచ్చినా ఎంత సేపు ఉంటదో తెలియని అయోమయం. ఆరుగాలం కష్టపడగా పంట చేతికి అందే సమయంలో విద్యుత్ సమస్యలు వచ్చేవి. విద్యుత్ సరఫరా ఆరు గంటలు కూడా సరిగా ఉండేది కాదు. అనేకసార్లు అంతరాయం అయ్యేది. పారిన దొయ్యే మళ్లీ పారేది. మోటర్లు కాలిపోయేవి. రాత్రి వేళల్లో త్రీ ఫేస్ కరెంట్ సరఫరా చేసేవారు. రైతులు రాత్రిళ్లు బావులు, బోర్ల వద్ద పడుకొని నీళ్లు పెట్టేవారు. ఈ క్రమంలో కరెంట్ షాక్, విషపురుగులు కుట్టి మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. పెట్టుబడులు కూడా రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవారు. ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి మిత్తీలు కూడా కట్టలేకపోయేవారు. ఎవుసం వదిలేసి పట్టణాలకు వలస పోయి భవన నిర్మాణ రంగం, ఇతర చిన్నా చితక పనులు చేసేవారు. అప్పులు పెరిగి తీర్చే మార్గం లేక కొందరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గతంలో నిత్యకృత్యం.
24 గంటల ఉచిత విద్యుత్‌తో భరోసా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేశారు. ఉచిత విద్యుత్ రూపంలో భరోసా ఇచ్చారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతు కుటుంబాలకు చేయూతనిచ్చారు. దీంతో పట్టణాలకు వెలసవెళ్లిన సన్న, చిన్నకారు రైతులు తిరిగి గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరాతో రైతులు సమృద్దిగా పంటలు పండించుకొని ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు.
జిల్లాలో 65,340 వ్యవసాయ కనెక్షన్లు
వరంగల్ జిల్లాలో సుమారు 65,340 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 74, 132 కేవీ సబ్స్టేషన్లు ఆరు ఉన్నాయి. లోవోల్టేజీ లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అసవరమైన ప్రతి చోట 25కేవీ, 63కేవీ, 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు రైతులు కొత్తగా బోర్లు వేసుకున్నా, బావులు నిర్మించుకున్నా విద్యుత్ శాఖ పేర డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకోగానే కనెక్షన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అవసరమైన చోటల్లా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు సాగు విస్తీర్ణం పెరిగింది.
రైతులకు ప్రభుత్వ అండ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటాంది. విత్తనాలు, ఎరువులు సమయానికి అందుతానై. కరెంటు కూడా ఎప్పటికీ ఉండడం వల్ల పంటలు మంచిగ పండుతానై. వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకుంటానం. కేసీఆర్ సార్ రైతులకు గతంల ఎప్పుడు లేనివిధంగా సహకారం ఇస్తాండు. రైతుబంధు, రైతు బీమా ఎంతో ఉపయోగ పడుతాంది. గతంల కరెంట్ రాకకోసం ఎదురు చూసెటోళ్లం. కరెంట్ కోతలతో పంటలు మధ్యలోనే ఎండిపోయి తీవ్రంగా నష్టపోయెటోళ్లం. కేసీఆర్ సార్ చేసిన పనుల వల్ల రైతులు, రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.
– సట్ల సమ్మయ్య, రైతు, ఇల్లంద
ముందుగా నారు పోసుకున్నం
గతంలో చెరువు తూములు తీసే వరకు వరి నార్లు పోసుకోకపోయేది. ఇప్పుడు కరెంటు మంచిగా ఉండడం వల్ల వానకాలం వడ్లు అమ్ముకోగానే యాసంగికి నార్లు పోసుకున్నం. కూడా నీళ్లు బాగానే ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు ఎప్పటికీ పోత్తానై. అందుకని వానకాలం, యాసంగి పంటలు పండించుకుంటానం. కరెంటు మంచిగ ఉంటాంది.
– బొంతల అనిల్, రైతు, వర్ధన్నపేట
అడగ్గానే ఏర్పాటు చేస్తున్రు..
ఇంకో ట్రాన్స్ఫార్మర్ కావాలని అడిగినం. వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నరు. మా బావులకాడ లో వోల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడ్డాం. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియజేయగా వర్ధన్నపేట-ఇల్లంద గ్రామాల మధ్య జాతీయ రహదారి పక్కన 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నరు. ఇక మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
– నాంపెల్లి ఐలయ్య, రైతు,