Parakala | పరకాల, నవంబర్ 1 : ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు.. ఒక్క కొత్త అభివృద్ధి పనిని తెచ్చింది లేదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకే కొత్తగా శంకుస్థాపనలు చేయడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే చెల్లింది. ఈ అంశం ప్రస్తుతం పరకాల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని దామెర మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
అందులో భాగంగా మండలంలోని సింగరాజుపల్లి, వెంకటాపురం, ల్యాదెళ్ల హరిచంద్రనాయక్ తండా వాసుల కోరిక మేరకు అప్పటి సీఎం కేసీఆర్‌తో చర్చించి బీటీ రోడ్డు నుంచి హరిచంద్రునాయక్ తండా, సింగరాజు పల్లె వరకు రూ.3.04 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్ నిధులను మంజూరు చేయించి గత ఏడాది అక్టోబర్ 2న పనులు ప్రారంభించారు.
కాగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఈ శిలాఫలకాన్ని మార్చి కొత్తగా పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోగా.. గత బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన పనులనే తిరిగి ప్రారంభించడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తన దృష్టిని అభివృద్ధిపై కాకుండా శిలా ఫలకాలను మార్చడంపై పెడితే ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.