హనుమకొండ, ఏప్రిల్ 21: పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్ హనుమకొండ కలెక్టరేట్ ముందు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. నడికుడ మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్రావు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ది చెందాయన్నారు. 50 సంవత్సరాలలో జరుగని అభివృద్ధి గత ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో జరిగి దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్న ఒక్క బిల్లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామాల అభివృద్ధికి అప్పులు తెచ్చి పనులు చేసామన్నారు. పనులకు సంబందించిన బిల్లులు రాకపోవడంతో కొందరు మాజీ సర్పంచ్‌లు తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ మెడలు వంచి కేసీఆర్ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని విజ్ఞప్తి చేసారు. పెండింగ్ బిల్లుల విషయంలో ఈ నెల 27వ తేదీలోగా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేలా ఒత్తిడి తేవాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఊర ప్రణీత్‌రావు, నాగవెళ్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.