హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేందుకు కదులుతున్న గ్యాలరీలుగా ఆర్టీసీ బస్సులు ఉండనున్నాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ‘జీఐ ఆన్ వీల్స్’ అనే కార్యక్రమాన్ని ఆ యన శుక్రవారం ఎంజీబీఎస్ బస్టాండ్లో ప్రారంభించి మాట్లాడారు. జీఐ గుర్తింపు పొందిన కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జీఐ ఉత్పత్తుల ప్రాచుర్యం, మారెటింగ్, విస్తరణకు ప్ర భుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ఈ చర్యల ద్వారా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని స్పష్టంచేశారు. ఆర్టీ సీ ఎండీ నాగిరెడ్డి , హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, సీహెచ్ వెంకన్న, విజయపుష్ప, రాజశేఖర్, ఖుస్రోషాఖాన్, రీజినల్ మేనేజర్లు శ్రీలత, సుధ పరిమళ, రీ సాల్వేట్ ఫౌండర్ సీఈవో శుభ్జిత్ సాహు, తదితరులు పాల్గొన్నారు.