హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టాక్) అనుమతించిన ప్రాజెక్టులను సమీక్షించే చట్టబద్ధమైన అధికారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వినతి మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (2015) తర్వాత గోదావరి నదిపై నిర్మించిన ఏడు ప్రాజెక్టుల అనుమతులపై సమీక్ష కోరుతూ జీఆర్ఎంబీ తమ ఎజెండా ఐటమ్ నంబర్ 18.3.6లో చేర్చిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్న ప్రాజెక్టులపై ఏపీ దరఖాస్తు చేయగానే బోర్డు వాటిని తిరస్కరించాలని, అలా చేయకుండా ఎజెండాలో చేర్చడం తెలంగాణ నీటి హకులను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలుసహా ఆ ఎజెండా ప్రతిని బయటపెట్టిన తర్వాత కూడా అసలు ఎజెండానే ఖరారు కాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు చెప్పడం ఆయన నిర్లక్ష్యానికి, అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్న రఘునందన్‌రావు బీజేపీ-కాంగ్రెస్ చీకటి ఒప్పందాలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ సెంటిమెంట్ కాదు; రియాలిటీ
బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారంటూ రఘునందన్‌రావు వ్యాఖ్యానించడంపై జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం సెంటిమెంట్ కాదని, తెలంగాణ నీటి వనరులు దోపిడీకి గురవుతున్న యథార్థ పరిస్థితి అని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీగా తెలంగాణ ప్రజల తరఫున నిలబడాల్సింది పోయి, పక రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. పొరుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ నేతలు, ప్రధాని మోదీ.. ఎన్డీఏ భాగస్వామి, ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గుతున్నారని ఆరోపించారు.
డీపీఆర్‌ను వెనకి పంపడం వెనుక కుట్ర
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను సిద్ధం చేసినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పర్యవేక్షణ లోపం, రాజకీయ అలసత్వం వల్ల కేంద్రం దానిని వెనకి పంపిందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. డీపీఆర్‌ను కేంద్రం వెనకి పంపడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని, బీఆర్ఎస్ హయాంలో సిద్ధమైన ప్రాజెక్టులను రక్షించడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
రేవంత్ చేసిన పాపానికి యాగం పేరుతో చేతులు కడుక్కుంటున్నారు
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వరుణయాగం నిర్వహించడం చేసిన పాపానికి చేతులు కడుక్కున్నట్టుగా ఉన్నదని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరద నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులను నింపే విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకొని ఉంటే ఈరోజు రాష్ట్రంలో రైతులకు నీటి కొరత వచ్చేది కాదని స్పష్టంచేశారు.