ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 27 : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన పూర్తి రికార్డులు, లైవ్ టెలికాస్ట్ వీడియో క్లిప్పింగులను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. చైర్మన్‌గా ఎన్నికైన తన నియామకాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టేకుల సుదర్శన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎన్ వి శ్రవణ్‌కుమార్ వివరాలు తెలిపారు.
సుదర్శన్‌రెడ్డి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రఘు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని, 15 మంది సభ్యుల మద్దతుతో సుదర్శన్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారని కోర్టుకు వివరించారు. వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభిస్తుండగా.. హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పి ఫలితం ప్రకటించకుండా నిలిపివేశారని తెలిపారు. సుదర్శన్‌రెడ్డి ఏకగ్రీవంగా చైర్మన్ పదవికి ఎన్నికయ్యారని, కాలయాపన చేయడం కోసం సభ్యులతో చేతులెత్తించి, సంతకాలు చేయించి.. తదుపరి కోర్టు స్టే వచ్చిందని ప్రకటించారని కోర్టుకు వివరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జరిగిన చైర్మన్ ఎన్నికను ప్రకటించి వెంటనే వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న న్యాయమూర్తి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి రికార్డులు, వీడియో క్లిప్పింగులు కోర్టుకు సమర్పించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. తుది విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.