నర్సంపేట, జూన్ 28: రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు తప్పదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలోని సిటిజన్ క్లబ్లో ‘సర్’ ప్రక్రియపై బీఆర్ఎస్ నియోజకవర్గ బీఎల్ఏ, సభ్యత్వ నమోదు బూత్ ఇన్చార్జులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో నర్సంపేటకు చేసిందేమీ లేదన్నారు.
నియోజకవర్గానికి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నిధులకు కొత్త కాగితం పెట్టి తానే తెచ్చానంటూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలపై సర్కారుకు ఏమాత్రం సోయి లేదని విమర్శించారు. నర్సంపేటలో 30 ఏళ్ల క్రితం అంతమైన గూండాయిజం, రౌడీ సంస్కృతి మళ్లీ పెరిగిందని, గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నదని, అధికారులకే రక్షణ లేకుండా పోయిందన్నారు. మట్టి, మొరం దందాతో రూ.10 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని తెలిపారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని, కేసులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని, మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం బీఆర్ఎస్ భవిష్యత్‌ను నిర్ణయించే కీలక ప్రక్రియ అని, ప్రతి కార్యకర్త బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. సర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అండగా నిలవాలన్నారు.
జరుగుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా బూత్ స్థాయి నుంచే పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్ తక్కళ్లపెల్లి రవీందర్రావు, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ నాడెం శాంతికుమార్, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, గోనె యువరాజ్, నామాల సత్యనారాయణ, బానోత్ సారంగపాణి, మండల శ్రీనివాస్, మోతె జయపాల్‌రెడ్డి, మచ్చిక నర్సయ్యగౌడ్, మోతె తిరుపతిరెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, శివరాత్రి స్వామి, సదానందం, సారంగం, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
సైనికుల్లా పని చేయాలి
బీఆర్ఎస్ అభివృద్ధి కోసం ప్రతి ఒకరూ సైనికుల్లా పని చేయాలి. ప్రతి ఏజెంట్ బూత్ ఆఫీసర్లతో కలిసి విధిగా ఇంటింటికీ వెళ్లి బాధ్యతగా ఓటర్ సవరణలో పాల్గోనేలా చూడాలి. సభ్యత్వ నమోదు కోసం తిరిగే సభ్యులు ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలి. బూత్ ఏజెంట్లు, సభ్యత్వ నమోదు చేసేవారు సర్పంచ్‌లు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, వార్డు సభ్యులకు అందుబాటులో ఉండాలి.
– ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే