చిల్పూరు, సెప్టెంబర్ 26 : ఊరూరా ప్రజలు డెంగ్యూ, విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రికి, నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చీమకుట్టినట్టు కూ డా లేదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వైద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మండిపడ్డారు.
ఇటీవల బీఆర్ఎస్ నియమించిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానల సందర్శనలో భాగంగా గురువారం ఆయన చిల్పూరు మండలం మలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్సీలో పరిస్థితులను చూసి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ దవాఖానలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, పీహెచ్సీ శుభ్రంగా లేకపోవడం చూస్తుంటే సర్కారు దవాఖానల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు.
ఇటీవల గాంధీ ఆసుపత్రి సందర్శనకు వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేశారని, కనీసం సందర్శనకు కూడా అనుమతించలేదని ధ్వజమెత్తారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలందేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మారపాక రవి, మాజీ మార్కెట్ డైరెక్టర్ రంగు హరీశ్, చిల్పూరు మండల యూత్ నాయకుడు అలుగు అశోక్, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గాలి ప్రవీణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.