నర్సంపేట, డిసెంబర్16 : నిండు అసెంబ్లీలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) చెప్పినవన్నీ అబద్ధ్దాలు, అసత్యాలేనని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, రోడ్ల నిర్మాణాలపై మంత్రి సీతక్క అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రి సీతక్క నర్సంపేట నియోజకవర్గానికి పక్కనే ఉన్న ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. కొత్తగా రోడ్ల నిర్మాణం చేయడానికి సంబంధించిన అన్ని నిధులను విడుదల చేశామని, ప్రతి గ్రామ పంచాయతీతో పాటు గ్రామాలు, తండాల్లో కొత్తగా రోడ్ల నిర్మాణం చేస్తున్నామని మంత్రి ప్రకటనలు చేయడం విడ్డూరమన్నారు.
నర్సంపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో మంజూరు చేసిన రూ. కోట్లాది నిధులను రద్దు చేశారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు. పక్క నియోజకవర్గం ములుగులో ఉండి ఒక్కనాడైనా నర్సంపేటకు వచ్చి సమీక్ష చేస్తే కదా మీకు తెలిసేది అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో తండాలు, గ్రామాలు, పల్లెలకు ఇచ్చిన బీటీ, సీసీ రోడ్లతో పాటు మహిళా భవనాలు, అనేక రకాల అభివృద్ధి నిధులు గత ప్రభుత్వంలోనే మంజూరయ్యాయన్నారు.
అనేక రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు, రీసెర్చ్ సెంటర్లు ఎక్కడివి అక్కడే మూలుగుతున్నాయన్నారు. మంత్రి సీతక్క అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు, నర్సంపేట నియోజకవర్గంలో జరిగే పరిస్థితులకు సంబంధం లేదన్నారు. ప్రభుత్వంపై పట్టులేదని, సొంత, నర్సంపేట నియోజకవర్గంలో సమీక్ష నిర్వహించే పరిస్థితి లేదన్నారు. మంత్రి సీతక్క నర్సంపేట అభివృద్ధిపై సమీక్ష ఎందుకు నిర్వహించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ కాంట్రాక్టర్లకు వాటాలున్న ఏజెన్సీలో పనిచేస్తే 2 నెలలకే బిల్లులు వస్తాయని, గత ప్రభుత్వంలో పనులు చేసి ఏడాది దాటినా బిల్లులు రాకపోవడం బాధాకరమన్నారు.
బిల్లులు ఆపి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది విమర్శించారు. రాష్ట్రంలో 10 శాతం వసూలు లేకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు లేవన్నారు. బిల్లుల కోసం 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరని, ప్రభుత్వానికి కప్పం కడితే 2 నెలల్లోనే బిల్లులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ మార్పు వల్ల అభివృద్ధి ఆగిపోయిందని, కొత్త నిధులు అడిగే వారు ఎవరూ లేరన్నారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని, తక్షణమే మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది కోరారు.