నర్సంపేట, అక్టోబర్ 31 : గాలి మాటల ముఖ్యమంత్రి గాలి తిరుగుడేనా..?అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే ఓపిక, సమయం సీఎంకు లేదా..? రైతులపై ఆయనకున్న ప్రేమ ఇదేనా? అని ప్రశ్నించారు. పంట నష్టపరిహారం ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకూ అందివ్వకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. వరంగల్, నర్సంపేట ప్రాంతాల్లోని రైతులు సర్వస్వం కోల్పోయి తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారని, వారికి భరోసా కల్పించాలన్నారు.
రైతులు 6నెలల పాటు కష్టపడి పండించిన పంటలు వర్షం కారణంగా నీళ్లపాలై, మొలకెత్తుతున్నాయన్నారు. మక్కజొన్న కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఏ ఒక్కచోటా ఏర్పాటు చేయలేదన్నారు. తడిసిన మక్కజొన్న, పత్తి, వరి ధాన్యాలను ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే రైతులకు నష్టపరిహారాన్ని అందించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. రైతులకు ఓదార్చడానికి, పంట నష్టాన్ని పరిశీలించడానికి ఓపిక, సమయం సీఎం రేంవత్రెడ్డికి లేదా అని పెద్ది ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార హడావుడిలో రైతులకు సమయాన్ని వెచ్చించలేక పోతున్నారా..అని ప్రశ్నించారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే సీఎం, మంత్రులు తూతూమంత్రంగా పర్యటనలు చేస్తూ కపట ప్రేమను చూపుతున్నారని విమర్శించారు.